చంద్రబాబు నాయుడుకి తనో అపర మేధావిని అని నమ్మకం. ఇందులో తప్పేమీ లేదు. చిన్న కుగ్రామంలో జన్మించి, ఎటువంటి రాజకీయ నేపధ్యం లేకుండా విద్యార్ధి రాజకీయాల నుంచి ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఎదిగి, మామ ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలోకి కొంచెం లేటుగా వచ్చినా అతితక్కువ కాలంలో పార్టీలో మొదటినుంచి ఉన్న నాయకులను వెనక్కి నెట్టి నంబర్ టూగా ఎదిగి, నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ లో ఎమ్మెల్యేలను క్యాంపులో ఉండి కాపాడి, మామను మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి, ఆ తరువాత నేరుగా ఎన్టీఆర్ మొహంలోకి చూడలేని ఎమ్మెల్యేలను కూడకట్టి, మామను దించివేసి ముఖ్యమంత్రి పీఠాన్ని, పార్టీ పగ్గాలనూ చేజిక్కించుకుని, ఆ తరువాత తెలివిగా పొత్తులు పెట్టుకుని రెండు సార్లు ముఖ్యమంత్రిగా, మరో రెండుసార్లు ప్రతిపక్ష నాయకుడుగా పార్టీలో ఏకఛత్రాధిపత్యం సాగించాలంటే ఎన్నో తెలివితేటలు ఉండాలి.
అయితే చంద్రబాబుతో ఇబ్బంది ఏమంటే అందరికన్నా తనే తెలివైనవాడిని అనుకునే ఆయన తత్వం. అయన అధికారంలో ఉంటే ప్రతిపక్షం, ఆయన ప్రతిపక్షంలో ఉంటే అధికారపక్షం తన మాటే వినాలని ఆయన అనుకుంటారు. రాష్ట్ర ప్రజలు కూడా ఆయన వారికి ఏది మంచిదని నిర్ణయిస్తే ఆ విధంగా ముందుకు పోవాలని ఆయన నమ్ముతాడు. అందుకే అయిదు సంవత్సరాలలో రాజధాని గ్రాఫిక్స్ చూపించి, ఇంకో అయిదేళ్ళు అవకాశం ఇవ్వండి,ఇవన్నీ కట్టి చూపిస్తాను అంటే రాష్ట్ర ప్రజలు నమ్మి మరోసారి అధికారం అప్పగిస్తారని భావించారు. అయితే ప్రజలు ఎవరేం చెప్పినా విని, అవకాశం దొరికినప్పుడు తెలివిగా కీలెరిగి వాత పెడతారని మొన్న ఎన్నికల్లో చంద్రబాబు తెలుసుకున్నాడు.
అంతా అమరావతి, అన్నీ అమరావతి
ఇప్పుడు చంద్రబాబు మనసంతా అమరావతి నిండి ఉంది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించడం కోసమే అమరావతి పోరాటం అని ఆయన చెప్తుంటే, తన బినామీలు, అస్మదీయులు అమరావతి చుట్టుపక్కల కొన్న భూముల విలువ కాపాడడానికే ఆయన ఆరాటం అని ప్రత్యర్థులు అంటున్నారు. ఎంతో ఆర్భాటంగా మొదలుపెట్టిన “సేవ్ అమరావతి” ఉద్యమం రాష్ట్రమంతా వ్యాపించి అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందని భావిస్తే అది అమరావతి దాటలేకపోయింది. ఇంతలో కరోనా వచ్చి ఉద్యమం మీద నీళ్ళు చల్లింది. చంద్రబాబు బయటకు రాగలిగి ఉంటే అనుకూల మీడియా సహాయంతో కనీసం వార్తల్లో అయినా ఉద్యమం నిలిచేలా చేయగలిగేవారు కానీ కరోనా ఆయన్ని జూమ్ మీటింగులకు పరిమితం చేసింది.
అమరావతి మీద రెఫరెండమ్
ఆరిపోతున్న అమరావతి ఉద్యమజ్యోతి ప్రకాశించడానికి గతంలో ఆయనే చెప్పిఉన్న రెఫరెండమ్ అంశాన్ని మరోసారి బయటకు తీశారు. “మీ ఎమ్మెల్యేలు అందరిచేత మీరు, మా ఎమ్మెల్యేలు అందరిచేత నేను రాజీనామా చేయించి, రాజధాని అంశం ఒకటే సింగిల్ పాయింట్ అజెండాగా ఎన్నికలకు వెళ్దాం. మీరు గెలిస్తే ప్రజలు మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్నట్లు, మేము గెలిస్తే అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని ప్రజలు భావిస్తున్నట్లు. మీరు రెడీయా? “అని నేరుగా అధికార పక్షానికి సవాలు విసిరాడు.
అయితే ఇది పరమ హాస్యాస్పదమైన ప్రతిపాదన అని ఆయనకే బాగా తెలుసు. ఇంకా మూడు సంవత్సరాల అధికారం మిగిలి ఉండగా, తమ 151 ఎమ్మెల్యేలని చంద్రబాబుకున్న 23 మందితో (వీరిలో కొందరు ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి ఉన్నారు) పోటీ పెట్టి, రాష్ట్రంలో ఎవరికీ పట్టని అంశం కోసం ఎన్నికలకు వెళ్ళడం అనేది కలలో కూడా జరగని పని అని చిన్న పిల్లలు కూడా చెప్తారు.
బాబుగారు రెఫరెండమ్ పెట్టొచ్చు
రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు తప్ప, అన్ని పార్టీలు, అందరు నాయకులు అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు అన్న విషయం ప్రపంచానికి తెలియజేసి, అధికారపక్షం మెడలు వంచాలంటే చంద్రబాబు చేతిలో మంచి ఆయుధం ఉంది. ఏదైనా అంశం మీద రెఫరెండమ్ కావాలంటే అధికార పక్షం మాత్రమే కాదు, ప్రతిపక్షం కూడా పెట్టుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఆ వెసులుబాటు ఉంది.
రేపు చంద్రబాబు తన పార్టీలో తన ఆదేశాలను పాటించే ఎమ్మెల్యేలు అందరితో రాజీనామాలు చేయించి, ఆ స్థానాల్లో వచ్చే ఉప ఎన్నికల్లో ఒక రాజధాని కావాలా, మూడు రాజధానులు కావాలా అని ఒకే ఒక పాయింటుతో ప్రచారం చేసి, అధికార పక్షాన్ని చిత్తుచేసి, గతంలో వచ్చిన దానికన్నా రెట్టింపు మెజారిటీతో ఆ స్థానాలను కైవసం చేసుకుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మాత్రమే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం అమరావతికి జై కొట్టక తప్పదు.