ఏ ముహూర్తాన బండి సంజయ్ పాదయాత్ర చేద్దామని తల పెట్టాడో కానీ పాదయాత్ర సంగతి పక్కన పెడితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. యాత్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తూ రాష్ట్రమంతా పర్యటించాలని రూట్‌మ్యాప్ వేసుకున్నారు బండి సంజయ్. భాగ్యలక్ష్మి అమ్మవారు ఆశీర్వాదంతో యాత్ర పేరు ప్రజా సంగ్రామ యాత్రగా ప్రకటించిన ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చిన పాదయాత్ర ఇప్పుడు బిజెపి సీనియర్ నేత కళ్యాణ్ సింగ్ మృతితో మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని బిజెపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
ఆగస్టు 9 నుంచి ప్రారంభం కావాల్సిన ప్రజా సంగ్రామ యాత్ర పార్లమెంట్ సమావేశాల వల్ల ఒకసారి, కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర వల్ల రెండోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన యాత్ర ఇప్పుడు బిజెపి సీనియర్ నేత కళ్యాణ్ సింగ్ మృతితో మరోసారి వాయిదా పడే చాన్స్ ఉంది. కళ్యాణ్ సింగ్ మృతితో ఈ నెల 24 వరకు సంతాపం దినాలుగా ప్రకటించింది జాతీయ బిజెపి నాయకత్వం. 24 వరకు కార్యకర్తలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదని కేంద్ర నాయకత్వం తో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. దింతో పార్టీ అధ్యక్షుడి పాదయాత్ర ఉంటుందా లేదా అన్న మీమాంశలో బిజెపి శ్రేణులు ఉన్నాయి.
ఆగస్టు 24 నుండి పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి నుంచి దశలవారీగా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు బండి సంజయ్. మొదటి దశలో భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి నుంచి హైదరాబాద్ వరకు చేపట్టాలని రూట్ మ్యాప్ ఖరారైంది. పాదయాత్రను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. పాదయాత్రను విజయవంతంగా నడిపించేందుకు 30 రకాల వివిధ కమిటీలను కూడా ఏర్పాటు చేసి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర బిజెపి నాయకత్వం. అయితే ఈ పాదయాత్రకు ఆదిలోనే అవాంతరాలు ఏర్పడటంతో పర్యటన ఉంటుందా లేదా తీవ్ర నిరాశకు లోనవుతున్నాయి బీజేపీ శ్రేణులు.
అయితే బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడే అవకాశం ఉండడంతో మళ్ళీ ఎప్పుడు పాదయాత్ర తేదీ ఎప్పుడు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పార్టీ లో చర్చించిన తర్వాత పాదయాత్ర పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బయటకు లీక్ అవుతున్న సమాచారాన్ని బట్టి ఈనెల 30 నుంచి బండి సంజయ్ పాదయాత్ర ఉంటుందని బిజెపి నాయకులు అంటున్నారు.
పాదయాత్రతో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ కార్యకర్తలలో జోష్ నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి టిఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావించిన బండి సంజయ్. 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు లక్ష్యంగా పార్టీని సిద్ధం చేయాలని బాగానే ప్లాన్ చేశారు. కానీ పాదయాత్ర వరుసగా వాయిదా పడుతూ ముందుకు పోకపోవడంతో నిరుత్సాహంగా ఉన్న బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేయక తప్పదు. పాదయాత్ర తేదీ ప్రకటించిన పాదయాత్ర మొదలైతే తప్ప బిజెపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రాదు.