ఇదే సందేహం వస్తోంది. వరుసగా దుబ్బాక ఉప ఎన్నికలు, తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన్ని వినియోగించుకునే విషయంలో బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే దుబ్బాకలో ప్రచారానికి పవన్ సిద్ధమయినప్పటికీ చివరి నిమిషంలో దానిని రద్దుచేశారు. తెలంగాణా ప్రాంతంలో ఆయన రాక మూలంగా బీజేపీకి నష్టం వస్తుందనే అంచనాతో జనసేనానిని నిలువరించినట్టు ప్రచారం సాగింది. ఇక ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో సైతం పవన్ ప్రచారం పై ఇంకా స్పష్టత రాకపోవడం విశేషం. పవన్ కి తెలంగాణా లో కూడా సినీ అభిమానులుండడం, హైదరాబాద్ శివార్లలో సీమాంధ్రుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పవన్ ప్రచారం ఉపయోగపడుతుందనే అభిప్రాయం కొందరు బీజేపీ నేతల్లో ఉంది. అయితే తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభిప్రాయం బిన్నంగా ఉన్నట్టు సమాచారం. దాంతో పవన్ కనీసం ప్రచారంలో అడుగు పెడతారా లేదా అన్నది స్పష్టత రాలేదు.
తెలంగాణా లో బీజేపీ దూకుడు పెంచింది. బల్దియా పీఠంపై గురిపెట్టింది. అన్ని రాష్ట్రాల నుంచి బీజేపీ కీలక నేతలు ఇప్పుడు హైదరాబాద్ కి క్యూ కడుతున్నారు. చివరకు అమిత్ షా, నడ్డా రాకకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాంటి సమయంలో పవన్ ని మాత్రం పట్టించుకోకపోవడం విశేషంగానే భావించాలి. సినీ నటుడిగా ఆయన క్రౌడ్ ఫుల్లర్ గా ఉపయోగపడతారనడంలో సందేహం లేదు. అయినప్పటికీ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఆయన రాక మేలు చేస్తుందా.. చేటు తెస్తుందా అన్నది తేల్చుకోలేని బీజేపీ నేతలు ఈ విషయంలో కాలయాపన చేస్తున్నట్టు కనిపిస్తోంది.
తాజాగా బీజేపీ ఆలిండియా అధ్యక్షుడి తో జరిగిన భేటీలో కూడా కేవలం తిరుపతి ఉప ఎన్నికల వరకే పవన్ ని పరిమితం చేసేలా చర్చ సాగినట్టు చెబుతున్నారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్, నాదెండ్ల మనోహర్ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల విషయం ప్రస్తావించలేదు. అంటే ఇక పవన్ ని కేవలం ఏపీకి పరిమితం చేసే ఆలోచనలో బీజేపీ పెద్దలున్నారనే వాదన బలపడుతోంది. తద్వారా ఏపీలో ఆయన ఇమేజ్ ని ఉపయోగించుకోవడం, తెలంగాణాలో జనసేన విస్తరణకు పూర్తిగా ద్వారాలు మూసేయడం అనే ద్విముఖ వ్యూహం ఇందులో కనిపిస్తోంది. ఏమయినా పవన్ రాకతో తెలంగాణాలో లాభం లేదనే నిర్ధారణతో బీజేపీ ఉన్నట్టు ప్రస్తుతానికి కనిపిస్తోంది పైగా ఆయన ప్రచారంలో ఏదయినా తేడా జరిగితే అసలుకే ఎసరు వస్తుందనే ఆందోళన కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఏమయినా తెలుగు నేల మీద అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులున్నప్పటికీ ప్రస్తుతానికి పొలిటికల్ పవనం ఏపీలో మాత్రమే వీచేందుకు అవకాశం ఉందని భావించాల్సి ఉంటుంది.