గడిచిన రెండేళ్లకు పైగా కేంద్ర క్యాబినెట్ లో ఆంద్రప్రదేశ్ కి చోటు లేదు. ప్రస్తుతం క్యాబినెట్ విస్తరణ వ్యవహారాల్లో మోడీ బిజీగా ఉన్న తరుణంలో ఈసారయినా ఛాన్స్ వస్తుందా అనే ఆసక్తి మొదలయ్యింది. పలు పేర్లు ప్రచారంలో వినిపిస్తున్నాయి. ఊహాగానాలు ఉధృతంగా ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ తరుపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత జీవీఎల్ నరసింహరావు బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనే ఆయన పేరు వినిపించినా అవకాశం రాలేదు. దానికి ప్రధాన కారణం పార్టీలో ఆయన వర్గానికి అప్పట్లో ప్రాధాన్యం దక్కకపోవడమే. ఇప్పుడు కూడా పార్టీలో రామ్ మాధవ్ ప్రాధాన్యత తగ్గిపోతోందనే ప్రచారం నేపథ్యంలో జీవీఎల్ ఆశలు ఏమేరకు నెరవేరుతాయో చూడాలి. శివరాజ్ సింగ్ చౌహాన్ తో ఉన్న స్నేహం జీవీఎల్ కి ఎంతవరకూ మేలు చేస్తుందన్న దానిని బట్టి ఆయన పదవీయోగం ఉంటుంది.
ఆయనతో పాటుగా టీడీపీ నుంచి ఫిరాయించి బీజేపీలో చేరిన టీజీ వెంకటేష్ కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారు. రాయలసీమకు చెందిన ఆయన గతంలో కాంగ్రెస్, టీడీపీ హయంలో కీలక పదవులు అనుభవించారు. ప్రస్తుతం బీజేపీ తరుపున కేంద్ర క్యాబినెట్ లో చోటు కోసం ప్రయత్ననిస్తున్నారు. అయితే ఫిరాయింపు ఎంపీకి అవకాశం ఏమేరకు ఉంటుందన్నది ప్రశ్నార్థకమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీడియాలో వినిపిస్తోంది. వాస్తవానికి జనసేనను బీజేపీ సీరియస్ పార్టనర్ గా భావించడం లేదని ఇటీవల పరిణామాలు చాటుతున్నాయి.
పవన్ నేరుగా బీజేపీతో చేతులు కలిపినప్పటికీ నేటికీ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ తో భేటీ కే ఆయనకు అవకాశం దక్కలేదు. అనేక మార్లు డిల్లీ వెళ్లినా చివరకు అమిత్ షా వరకూ ఆయన వెళ్లగలిగారు. అంతేగాకుండా ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల సందర్భంలో కూడా పవన్ వ్యవహరించిన తీరు బీజేపీ అధిష్టానానికి రుచించలేదు. పలువురు స్థానిక నేతలు కూడా ఫిర్యాదులు చేయడంతో వాటిని పరిగణలోకి తీసుకున్నారు. ఆ ఎన్నికల తర్వాత బీజేపీ జనసేన కలిసిన దాఖలాలు లేవు. ఇటీవల రైతు, ఆస్తిపన్ను వంటి సమస్యల మీద బీజేపీ సొంతంగానే గళం వినిపిస్తోంది. జనసేన అయితే చప్పుడు కూడా లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అంటీముట్టనట్టుగా రాష్ట్రంలోనే వ్యవహరిస్తుంటే కేంద్రం పెద్దలు పీకే ని కనికరిస్తారని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందనే వాదన ఉంది. ఏపీ బీజేపీ నేతలు కూడా పవన్ కి క్యాబినెట్ హోదా ప్రచారాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. ఇక మిగిలిన జీవీఎల్ , టీజే వెంకటేష్ వ్యవహారం మాత్రం తేలాల్సి ఉంది. వీహెచ్ పీ నేతల అండతో టీజే వెంకటేష్ ప్రయత్నాల్లో ఉండగా, మధ్యప్రదేశ్ లాబీ మీద జీవీఎల్ నమ్మకం పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో మోడీ ఎవరిని కనికరిస్తారు.. లేదా మళ్లీ ఏపీని ఖాళీగా ఉంచేస్తారా అన్నది చూడాలి.
Also Read : ఆ మాజీ ఎమ్మెల్యే మేయర్ పీఠం పై కన్నేశారా..?