శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదం మూలంగా దీర్ఘకాలిక సమస్యలు తలెత్తేలా కనిపిస్తోంది. తెలంగాణా ప్రభుత్వానికి విద్యుత్ కొరత ఏర్పడడం ఖాయమనే సందేహాలు వినిపిస్తున్నాయి. సుమారుగా ఏటా 2వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన జరిగే ప్లాంట్ నిలిచిపోయింది. మళ్లీ ఎప్పటికి ప్రారంభిస్తారనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. నాలుగు యూనిట్లు పూర్తిగా ధ్వంసం కావడం, మిగిలిన రెండు యూనిట్ల పరిస్థితి ఇంకా స్పష్టత లేకపోవడంతో నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో ఈ ఏడాది విద్యుత్ ఉత్పాదన కోల్పోయినట్టేనని చెప్పవచ్చు. మళ్లీ పునః ప్రారంభం మీద కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ప్రమాదానికి కారణాలపై ఇప్పటికే సీఐడీ రంగంలో దిగింది. అడిషనల్ డీఐజీ గోవింద్ సింగ్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. పలువురు సిబ్బందితో మాట్లాడింది. వివరాలు సేకరిస్తోంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించబోతోంది. ప్రాధమిక సమాచారం ప్రకారం జలవిద్యుత్ ఉత్పాదన కోసం అవసరమైన బ్యాటరీలు మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగిందనేది ఇప్పటికే స్పష్టం అయ్యింది. అమర్ రాజా బ్యాటరీ కంపెనీకి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా మృత్యువాతపడడం అందుకు నిదర్శనం. అయితే షార్ట్ సర్క్యూట్ తో పాటుగా ప్లాంట్ లో ఇతర సమస్యలు కూడా పెద్ద స్థాయిలో నష్టానికి మూలమని భావిస్తున్నారు.
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కి చెందిన అమర్ రాజా కంపెనీ నుంచి ఈ బ్యాటరీని కొనుగోలు చేశారు. అయినప్పటికీ వాటిని అమర్చే క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించడంలో ఏదయినా మానవ తప్పిదం జరిగిందా లేక సాంకేతిక సమస్యలున్నాయా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. వాస్తవానికి జలవిద్యుత్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత తగ్గుతోంది. దానికి బదులు థర్మల్,సోలార్, విండ్ పవర్ ఉత్పత్తిని అన్ని చోట్లా చేపడుతున్నారు. తెలంగాణలో కూడా థర్మల్ విద్యుత్ వినియోహమే ఎక్కువ. అయితే ఈ సీజన్లో శ్రీశైలం నుంచే అత్యధికంగా విద్యుత్ ని ఉత్పత్తి చేయాలనే ప్రయత్నం చేశారు.నిరంతరాయంగా విద్యుత్ ఉత్పాదనకు ప్రాధాన్యతనివ్వడం కూడా ప్రమాదానికి కారణం అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం చరిత్రలో జరిగిన అతి పెద్ద ప్రమాదానికి మూలాలు వెలికితీసే పనిలో ఇప్పటికే దర్యాప్తు బృందం ప్రయత్నాలు సాగిస్తోంది. కానీ అసలు కారణాలు వెలుగులోకి రావడం, అనంతరం మళ్లీ ప్లాంట్ ని పునః ప్రారంభించడం పట్ల పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో వ్యయం చేసి జలవిద్యుత్ కేంద్రాన్ని మళ్లీ కేసీఆర్ ప్రారంభిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. అదే సమయంలో కాళేశ్వరం వంటి చోట్ల జలవిద్యుతుత్పాదనకు అవకాశాలున్న తరుణంలో శ్రీశైలం పరిస్థితి ఏమిటన్నది వేచి చూడాల్సి ఉంది.