టీవీ ప్రేక్షకులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 4కి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే నాగార్జునతో రకరకాల ప్రోమోలు చేయించి స్టార్ మా ఫుల్ గా ప్రమోట్ చేస్తోంది. మూడు సీజన్లు హిట్టయినప్పటికీ హిందీ, తమిళంలో వచ్చినంత భారీ రెస్పాన్స్ ఇక్కడ దక్కలేదన్నది వాస్తవం. ఏదో ఒక వివాదం, అసంతృప్తి ప్రతిసారి వెంటాడుతూనే ఉన్నాయి. కాంట్రావర్సిలు ఈ షోలో సహజమే అయినప్పటికీ హౌస్ లో జరిగే తతంగం, బయట సోషల్ మీడియాలో జరిగే రభస వల్లే కొంత నెగటివ్ ఇమేజ్ కూడా వచ్చింది. అందుకే ఈసారి అలాంటివి జరగకుండా చాలా స్పైసీగా ఇంటరెస్టింగ్ గా ఉండేలా స్క్రిప్ట్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలిసింది.
తాజాగా పార్టీసిపెంట్స్ కు సంబంధించిన లీకులు కూడా మెల్లగా బయటికి వస్తున్నాయి. ఎవరూ అధికారికంగా ప్రకటించకపోయినా పేర్లు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. వాటి ప్రకారం చూసుకుంటే డ్యాన్స్ మాస్టర్ జానీ, గాయని మంగ్లీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, నువ్వు తోపురా హీరో సుధాకర్, బుల్లితెర నటి సమీరా, యుట్యూబ్ ద్వారా పేరు తెచ్చుకున్న హారికా-సమీర్ తదితరులు ఉండే అవకాశాలు చాలా ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. ఇప్పటిదాకా ఎవరూ మేము బిగ్ బాస్ లో ఉన్నామని బహిరంగంగా చెప్పలేదు. ఆఫ్ కోర్స్ ఒకవేళ ఎవరు ఉన్నా లేకపోయినా ఛానల్ నిబంధనల ప్రకారం ముందే బయటికి చెప్పకూడదని అగ్రిమెంట్ లో రాసుకుంటారు కాబట్టి ఏది నిజం ఏది అబద్దం ఖచ్చితంగా చెప్పడానికి లేదు. అందుకే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా ఎదురుచూపులు తప్పవు.
ఇకపై బిగ్ బాస్ సిరీస్ కు నాగార్జుననే పర్మనెంట్ యాంకర్ గా కొనసాగించేలా స్టార్ మా ప్లానింగ్ తో ఉందట. సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో ఇది ప్రారంభం కావొచ్చు. ఇప్పటికే ఇందులో పాల్గొంటున్న వాళ్ళను క్వారెంటైన్ లో పెట్టేశారు. టెస్టులు చేశాక హౌస్ లోకి పంపిస్తారు. దీని లాంచ్ ఈవెంట్ ని స్టార్ మా చాల గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా చేయనంత భారీగా ఉండబోతోందట. కొందరు ప్రత్యేక అతిథులను కూడా కర్టెన్ రైజర్ కోసం పిలిపిస్తున్నట్టు చెబుతున్నారు. రేటింగ్స్ విషయంలో తీవ్రమైన పోటీ ఎదురుకుంటున్న ఛానల్ కు ఈ షో చాలా కీలకంగా మారనుంది. అందులోనూ ఏడాది గ్యాప్ తర్వాత వస్తున్న కొత్త సీజన్ కావడంతో అభిమానులు కూడా ఉత్సుకతతో ఉన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఎలాంటి స్కిట్స్, టాస్కులు ఉంటాయోనని సామాన్యుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇంకో మూడు వారాల్లో వచ్చేస్తున్న బిగ్ బాస్ 4 ఇకపై గట్టి హడావిడే చేసేలా ఉన్నాడు