సైరా వచ్చి ఏడు నెలలయ్యింది. మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా రూపొందిన ఆ చిత్రం బయట రాష్ట్రాల్లో డిజాస్టర్ అయినప్పటికి ఇక్కడ మాత్రం కాస్త చెప్పుకోదగ్గ వసూళ్లతోనే బయట పడింది. అయితే ఆశించిన స్థాయికి చేరుకోలేదన్నది మాత్రం వాస్తవం. దాని కోసం రెండేళ్లకు పైగా తన టైంని ఖర్చు పెట్టిన దర్శకుడు సురేందర్ రెడ్డి నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడనే దాని మీద ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అసలు తను మీడియాకు సైతం అందుబాటులో లేడు. సైరా డిజాస్టర్ కాకపోయినా ఎందుకో తర్వాతి సినిమా విషయంలో ఇంకా అయోమయం కొనసాగుతూనే ఉంది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం సూరి టార్గెట్ లో ఇద్దరు హీరోలు ఉన్నారట. ఒకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన రేసు గుర్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని సీక్వెల్ పనులు జరుగుతున్నాయని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ కొత్త కథతో చేద్దామనే ఆలోచనలో ఇద్దరూ ఉన్నట్టు మరో న్యూస్. కానీ బన్నీ ఇప్పుడు పుష్ప, దాని తర్వాత ఐకాన్ అని వచ్చే ఏడాది కూడా బ్లాక్ చేసుకున్నాడు. మరి నిజంగా సూరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా వేచి చూడాలి. మరోవైపు రవితేజతో సైతం చేసేందుకు సురేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు ఇంకో టాక్ ఉంది. కిక్ అప్పట్లో బాక్స్ ఆఫీస్ కి మంచి కిక్ ఇచ్చింది. కానీ అదే అంచనాతో కిక్ 2 చేస్తే అది దారుణంగా బోల్తా కొట్టింది.
మాస్ మహారాజా ప్రస్తుతం క్రాక్ బాలన్స్ పూర్తి చేయాల్సి ఉంది. వీటి తర్వాత రమేష్ వర్మ, వక్కంతం వంశీలలో ఒకరితో కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. వీటి సంగతాలా ఉంచితే సురేందర్ రెడ్డి ప్రస్తుతం వెబ్ సిరీస్ ల నిర్మాణం మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలిసింది. తాను దర్శకత్వం వహించకుండా కేవలం పర్యవేక్షణ చేస్తూ నిర్మించేలా ప్రస్తుతం దగ్గరుండి పనులు చేయిస్తున్నారని వినికిడి. ఈ వ్యవహారమంతా వీడియో కాల్స్ ద్వారా జరుగుతోందట. ప్రస్తుతం సూరి యుఎస్ లో ఉన్నట్టు సమాచారం. వీటి సంగతి సరే కాని తనలోని దర్శకుడికి రెస్ట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి అతన్ని ఎప్పుడు బయటికి తీసుకోస్తాడో వేచి చూడాలి. ముందైతే హీరో ఫిక్స్ అవ్వాలి మరి. అందరూ బిజీగా లాక్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు.