అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి భుజం తట్టి నేనున్నానని భరోసా కల్పించేవాడే నిజమైన రాజకీయ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నుంచి అటువంటి నాయకుడు ఏ జిల్లాలోనూ కనిపించ లేదన్నది వాస్తవం. అప్పుడప్పుడు వెలుపలకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేసేసి కనుమరుగయ్యే వారే తప్పా.. ప్రజలను ఆదుకున్న దాఖలాలు చాలా చాలా తక్కువనే చెప్పొచ్చు.
కరోనా బారిన పడుతున్నా అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం.. అనుక్షణం ప్రజలతోనే ఉంటున్నారు. ప్రభుత్వ పరంగా సహకారం అందించడం.. ప్రజలకు మనో ధైర్యం కల్పించడంలో సఫలీకృతమవుతున్నారు. ఇప్పటికే ఏడుగురుకు పైగా వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ ప్రజలకు సేవల చేస్తూనే ఉన్నారు.
ప్రజల ఓట్లతో ఎన్నో పదవులు పొంది…
ప్రజల ఓట్లతో, సహకారంతో గతంలో ఎన్నో పదవులు పొంది రాజ్యమేలిన నాయకులు కూడా కరోనా కాలంలో ప్రజలకు అండగా నిలవలేకపోయారు. నెలల తరబడి లాక్ డౌన్ అమలు జరుగుతున్న వేళ వ్యాపారాలు లేక, పనులు దొరక్క, ఉపాధి కరువై బతుకు బరువై అనేక ఇబ్బందులు పడుతున్నప్రజలను ఆదుకునే ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టని నేతలు టీడీపీలో చాలా మందే ఉన్నారు. తమ సొంత ప్రాబల్యం కోసం మాత్రమే పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడారు. ఆస్తి కోసం అస్తిత్వం కోసం మాత్రమే అప్పుడప్పుడూ తళుక్కున మెరిశారు. ఆ చర్యలవల్ల వారి ప్రతిష్ఠను మరింతగా దిగజార్చుకున్నారు.
అధిష్టానం ఆదేశించినపుడు తప్పనిసరై నోరువిప్పుతున్నారు. అది కూడా చేయలేని కొందరు పత్రికా ప్రకటనలతో సరిపెడుతున్నారు. టీడీపీ హయాంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవించిన వారు ఇప్పుడు కనీసం జనం కోసం ఒక్క సాయం కూడా చేయడం లేదు. కానీ ఇంకా ప్రజలను అమాయకులుగా భావించి వారిని నమ్మించడం కోసం అప్పుడప్పుడు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.
పోనీ స్టే హోమ్.. స్టే సేఫ్ అనుకుంటే…
కరోనా నేపథ్యంలో సర్వత్రా వినిపిస్తున్న నినాదా స్టే హోమ్.. స్టే సేఫ్. వీలైనంత వరకు బయటకు రాకపోవడం మంచిది కూడా. అయితే తమ అవసరాలు, రాజకీయాల కోసం మాత్రం టీడీపీ నేతలు బయటకు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు సమయంలో బయటకు వచ్చి కోవిడ్ నిబంధనలను సైతం తుంగలో తొక్కారు. అలాగే.. కరకట్ట కూల్చివేతకు ఏడాది అంటూ టీడీపీ నేతలు నిబంధనలను తుంగలో తొక్కి హల్ చల్ చేశారు.
ఇవే కాదు.. అచ్చెన్ననాయుడు అరెస్టు సమయంలో అయితే గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు సమయంలోనూ రోడ్డెక్కారు. కానీ.. ప్రజల కోసం.. ప్రజల కొరకు… క్షేత్రస్థాయిలోకి వచ్చిన తెలుగుదేశం నేతలు కనిపించ లేదు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఓడిపోయినంత మా త్రాన ప్రజలను, కార్యకర్తలను పూర్తిగా టీడీపీ నేతలు విస్మరించడం వారి స్వార్థానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.