నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం నానుతోంది. ఇప్పటికే నాలుగు నెలలు గడుస్తోంది. ఆయనకు పదవీగండ ప్రమాదం మార్చి నెల మధ్యలో మొదలయ్యింది. చివరకు జగన్ సర్కారు మార్చిన నిబంధనలతో ఆయన పదవి కోల్పోయారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన స్థానంలో రిటైర్డ్ జడ్జి కనగరాజ్ ని నియమించడంతో నిమ్మగడ్డ న్యాయపోరాటానికి దిగారు. ఏపీ హైకోర్ట్, సుప్రీంకోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పులు వచ్చినట్టు అనుకూల మీడియాలో ప్రచారమే తప్ప ఆయన ఫలితం దక్కడం లేదు. ఇక తాజాగా మరోసారి గవర్నర్ ని ఆశ్రయించాలంటూ ఏపీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు పట్ల కూడా అలాంటి ప్రచారమే సాగుతోంది. జగన్ సర్కారుకి అది ఎదురుదెబ్బ అన్నట్టుగా ఓ వర్గం మీడియా చిత్రీకరిస్తోంది.
కానీ వాస్తవం పరిశీలిస్తే నిమ్మగడ్డ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చిందన్నది సుస్పష్టం. గవర్నర్ ని కలవాలని ఆదేశాలు ఇచ్చిన హైకోర్ట్ తీర్పు కన్నా ముందే ఎస్ ఈ సీ నియామకం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని తేల్చింది. గవర్నర్ కి మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని నియమించే అధికారం ఉందని చెప్పింది. క్యాబినెట్ సిఫార్సులు కూడా చెల్లవని చెప్పింది. ఆర్టికల్ 243-కే ప్రకారం గవర్నర్ విచక్షణాధికారం ప్రకారమే ఎన్నికల సంఘం అధికారి నియామకం జరుగుతుందని స్పష్టం చేసింది.
అంతేగాకుండా నిమ్మగడ్డ కొనసాగుతారని మాత్రం చెప్పలేదు. అదే సమయంలో ఆయన నియామకం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. చివరకు నిమ్మగడ్డ కోర్ట్ ఆదేశాలను ఉల్లంఘించారంటూ ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో విచారణ 24 వ తేదీకి వాయిదా పడింది. కానీ ఈ విషయంలో హైకోర్ట్ కూడా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేదని అంతకుముందు ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎస్ఈసీ నియామకం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విషయం కాదని, గవర్నర్ దేనని హైకోర్ట్ పేర్కొన్న దాని ప్రకారం నిమ్మగడ్డ పునర్నియామకం విషయంలో ఏపీ ప్రభుత్వానికి సంబంధం ఉండదు. దానిని పూర్తి చేయాల్సింది గవర్నర్ కాగా, జగన్ సర్కార్ మీద ఉల్లంఘన కేసు వేసినా చెల్లకపోవచ్చని న్యాయనిపుణుల అభిప్రాయంగా వినిపిస్తోంది.
ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ మాత్రం హైకోర్ట్ కి జవాబుదారీ కాదు. కాబట్టి ఆయన్ని నిలదీసే అవకాశం లేదు. అంతేగాకుండా ఏపీ ప్రభుత్వానికి నియామకంతో సంబంధం లేదని కోర్ట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నందున ఇక నిమ్మగడ్డ విషయం ఎటూ తేలకుండా మరింత సాగదీసేందుకు దోహదపడవచ్చని భావిస్తున్నారు. మరో 5 నెలల్లో నిమ్మగడ్డ పదవీకాలం ముగియబోతోంది. జవనరి 2021లో ఆయనకు ఆరేళ్ల పదవీకాలం ముగుస్తుంది. అప్పటి వరకూ ఈ కేసులో కాలయాపన తప్ప కొలిక్కి వచ్చే అవకాశం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా నిమ్మగడ్డ వ్యవహారం ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాకపోవడంతో శ్రమ పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుందా అనేవారు పెరుగుతున్నారు.