వాట్సాప్ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీ నిబంధనలు ఆ యాప్ పాలిట శాపంగా మారాయి. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా వాట్సాప్ నూతన విధానాలు ఉన్నాయని భావించిన యూజర్లు ప్రత్యామ్నాయ అప్లికేషన్లయిన సిగ్నల్,టెలిగ్రామ్ లకు మారిపోతుండడంతో నూతన ప్రైవసీ విధానంపై వాట్సాప్ వెనక్కి తగ్గింది.మరో మూడు నెలల పాటు అప్డేట్ని వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది.
వాట్సాప్ మీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించందని చెప్పుకొచ్చిన వాట్సాప్ మీరు పంపే లొకేషన్లను చూడదని, మీరు చేసే కాల్స్ & మెసేజెస్ లను గమనించదని,మీ కాంటాక్ట్స్ ని ఫేస్బుక్ తో పంచుకోదని వివరణ ఇచ్చింది. నూతన అప్డేట్ వల్ల ఏదీ మారడం లేదని బిజినెస్ ఫీచర్స్‌ని మరింత మెరుగ్గా అందించడం కోసమే ఈ కొత్త అప్డేట్ ని తీసుకొచ్చామని తెలిపింది.తాజాగా తీసుకొచ్చిన కొత్త అప్డేట్ ని యూజర్లు అంగీకరించే తేదీని మేం వెనక్కి తీసుకుంటున్నామని,ఫిబ్రవరి 8 న కొత్త పాలసీ నిబంధనలను అంగీకరించని వారి అకౌంట్లను నిలిపివేయమని వాట్సాప్ ప్రకటించింది.
కాగా 10 రోజుల క్రితం వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. యూజర్లు వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త పాలసీ నిబంధనలను అంగీకరించకపోతే ఫిబ్రవరి 8 నుండి వారి వాట్సాప్ పనిచేయదని ప్రకటించింది. దీంతో వాట్సాప్ ని బాయ్ కాట్ చేయాలని పలువురు ప్రముఖులతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పిలుపునిచ్చారు. దాంతో ఒక్కసారిగా వాట్సాప్ నుండి సిగ్నల్,టెలిగ్రామ్ లాంటి ప్రత్యామ్నాయ అప్లికేషన్లకు యూజర్లు మారడంతో వాట్సాప్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో చేతులు కాలిన అనంతరం ఆకులు పట్టుకున్న చందంగా వాట్సాప్ వ్యవహరిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు..