ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ గా సభా కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం లభించింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసి, ఆ తర్వాత 2014లో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన కిరణ్‌కుమార్ రెడ్డి ఆ ఎన్నికల్లో విఫలమయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం మానేశారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపేందుకు యత్నిస్తున్న రాహుల్ గాంధీ.. ఆ బాధ్యతలను కిరణ్‌కుమార్ రెడ్డికి అప్పజెబుతారనే ప్రచారం ఇటీవల సాగింది. ఈ విషయంపై ఆయనేమీ స్పందించలేదు. ఇదే రోజు 1960 సెప్టెంబర్ 13న జన్మించిన కిరణ్‌కుమార్ రెడ్డి.. 61వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇంకా 20 ఏళ్లపాటు రాజకీయాలు చేసే అవకాశం కిరణ్‌కుమార్ రెడ్డికి ఉన్నా.. మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా..? లేదా..? చూడాలి.
సీనియర్ ఎమ్మెల్యే, స్పీకర్‌గా పని చేసిన అనుభవం ఉండడంతో కిరణ్‌కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ కెప్టెన్‌ను చేసింది. విద్యావంతుడైన కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానం నమ్మకాన్ని నిలిపేలా ముఖ్యమంత్రి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. అవినీతి రహిత పాలన సాగించారని పేరొందిన కిరణ్‌కుమార్ రెడ్డి.. రాష్ట్ర విభజన సమయలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారనే విమర్శలను ఎదుర్కొన్నారు. సరైన సమయంలో వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే విభజన ఆంధ్రప్రదేశ్‌కు నష్టం చేకూరిందనే అపవాదను కిరణ్‌కుమార్ రెడ్డి మూటకట్టుకున్నారు.
Also Read : ఒంటరి కష్టాలు: రేవంత్ కు కోరస్ ఎక్కడ…?
ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన ముద్రవేసిన కిరణ్‌కుమార్ రెడ్డి.. పలు వినూత్నమైన పథకాలను మొదలుపెట్టారు. వాటిలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించడం, రాజీవ్ యువరత్నాలు పేరుతో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పుకొవచ్చు. వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలు పెట్టిన ప్రతి పథకాన్ని కొనసాగిస్తూ.. పరిపాలనలో తన ముద్ర కూడా ఉండేలా కిరణ్‌కుమార్ రెడ్డి చూసుకున్నారు. ఆడబిడ్డలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టారు. దానికి చట్టబద్ధత కల్పించారు. అయితే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ పథకం పేరును మహాలక్ష్మీగా మార్చి అమలును అటకెక్కించింది.
ముఖ్యమంత్రిగా పరిపాలనతో మంచిపేరు తెచ్చుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి.. రాష్ట్ర విభజన సమయంలో తనస్థాయికి తగినట్లుగా వ్యవహరించలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌తో ఉద్యమం కొనసాగుతోంది. ఆ సమయంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలిసే అవకాశం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఉంది.
రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందన్న విషయం తెలిసిన వెంటనే.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు ఏం కావాలి..? విభజన వల్ల ఎలాంటి నష్టం జరుగుతోంది..? ఆ నష్టాన్ని ఎలా భర్తి చేయాలి..? రాజధాని లేని ఏపీకి కేంద్రం నుంచి ఎలాంటి మద్ధతు కావాలి..? ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న హైదరాబాద్‌ను వదులుకున్నందుకు ఏపీకి ఏమి ఇస్తారు..? మళ్లీ మొదటి అడుగు నుంచి ప్రారంభమయ్యే ఏపీ పయనానికి ఎలాంటి సహాయం అందిస్తారు..? అనే అంశాలపై కిరణ్‌కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.
Also Read : మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత
అయితే వీటిని వదిలేసిన కిరణ్‌కుమార్ రెడ్డి.. రాష్ట్ర విభజన కు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర వాణి వినిపించారు. కిరణ్‌కుమార్ విభజనను అడ్డుకోగలనని భావించినట్లున్నారు. కానీ రాష్ట్రంలోగానీ, కేంద్రంలోగానీ తన మాట చెట్టుబాటయ్యే పరిస్థితి ఉందా..? ప్రజలను, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఉందా..? అనే అంశాలను ఆయన గుర్తించలేకపోయారు. దీని ఫలితమే విభజన తర్వాత ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలు.
లాస్ట్ బాల్ అంటూ ఆది నుంచి చెబుతూ వచ్చిన కిరణ్‌కుమార్ రెడ్డి.. ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన జరగదని బలంగా చెప్పారు. బెర్లిన్ గోడ గురించి పదే పదే చెప్పుకొచ్చారు. విభజన తర్వాత వచ్చే సమస్యల గురించి ఏకరవు పెట్టారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల జేఏసీని ముందు పెట్టి సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో చంద్రబాబు నడిపిన రాజకీయ ఎత్తులను పసిగట్టలేకపోయారు. చివరకు ఆ ఉద్యమాన్ని తన నెత్తికి ఎత్తుకున్నారు. సమైక్యాంధ్ర హోరులో , రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు ఎలాంటి న్యాయం చేయాలని అడిగే వారి గొంతులు వినపడకుండా పోయాయి.
సమైక్యాంధ్ర పేరుతో రాజకీయ పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. ఘోరంగా విఫలమయ్యారు. విభజన తర్వాత ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు ఆ సమైక్యాంధ్ర ఉద్యమం కూడా ఒక కారణమైంది. రాజధానిలేని రాష్ట్రం, మొదటి అడుగు నుంచి ప్రారంభమయ్యే ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ క్రమంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా కావాలనే ప్రచారం సమైక్యాంధ్ర ఉద్యమంతో ప్రజల్లోకి వెళ్లింది. సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.
Also Read : నక్సలైట్లు మాజీ ఎమ్మెల్యే బుడ్డా వెంగళ రెడ్డిని ఎందుకు చంపారు?
విభజన బిల్లు రాష్ట్ర శాసన సభకు వచ్చి తర్వాతైనా విభజన అనివార్యం, తాను అడ్డుకోలేనని కిరణ్‌కుమార్ రెడ్డి గ్రహించి, అందుకు అనుగుణంగా సీమాంధ్ర హక్కులను కాపాడుకుని ఉంటే కాంగ్రెస్ ,ఆయన పరిస్థితి మరోలా ఉండేది. రాజధాని, ప్రత్యేక హోదా, దిగువన ఉండే సీమాంధ్రకు జలవివాదాలు లేకుండా కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి, వాటిని సాధించి ఉంటే కిరణ్‌కుమార్ రెడ్డి రాజకీయ జీవితం ఈ రోజు దేదీప్యమానంగా వెలిగిపోయేది. సీమాంధ్రలో ఆయనో శక్తివంతమైన నేతగా ఎదిగేవారు. ప్రజల మద్ధతు లభించేది.
గత 8 ఏళ్లుగా ఆయన బయట కనిపించిన సందర్భాలు లేవంటే అది ఆయన చేసుకున్న స్వీయ తప్పిదమేనని చెప్పాలి. 61 ఏళ్ల కిరణ్‌కుమార్ రెడ్డి రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలోకి వస్తారా..? వస్తే వెంటాడే గతం నుంచి ఎలా బయటపడతారు..? పరిస్థితులు అనుకూలిస్తాయా..? ఒక వేళ కిరణ్‌కుమార్ రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తే మాత్రం ఆది అత్యంత ఆసక్తికరమైన విషయమవుతుంది.
Also Read : ప్రియాంక గాంధీ 12 వేల కిలోమీటర్ల పాదయాత్ర