దశాబ్దాల తరబడి దేశాన్ని ఏలిన పార్టీ అది. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి తెలంగాణ దశాబ్దాల కళ నెరవేర్చిన పార్టీ అది. రాష్ట్రాన్ని ప్రకటించినా తెలంగాణలో ఆదరణ లేదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించి అక్కడ అతీ గతీ లేదు. ప్రస్తుతం రెంటికీ చెడిన రేవడిలా కాంగ్రెస్ పరిస్థితి మారింది. తెలంగాణ లో ఎదగలేక పోతోంది.. ఏపీలో మళ్లీ ఖాతా తెరవ లేక పోతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమితో మరో సారి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై చర్చ జరుగుతోంది. మహామహులంతా అక్కడ మకాం వేసినా కనీసం డిపాజిట్ కూడా దక్కక పోవడంతో పార్టీ శ్రేణులలో అయోమయం నెలకొంది.
భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పవా..?
ఇప్పటి వరకూ తెలంగాణ లో కాంగ్రెస్ కు టీఆర్ఎస్ తో మాత్రమే పోటీ ఉండేది. అయినప్పటికీ గత ఎన్నికల్లో కేవలం 19 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అందులోనూ ప్రస్తుతం ఉన్నది 7గురు మాత్రమే. దీనికి తోడు రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ పుంజుకుంటుంది. భవిష్యత్‌లో టీఆర్ఎస్ తో పాటు బీజేపీ నుంచి కూడా గట్టి పోటీ ఎదుర్కోనుంది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ నాయకత్వాన్ని గందరగోళంలో పడేసింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ కీలక నేతలంతా ఎన్నికల క్షేత్రంలో విస్తృతంగా పనిచేసినా ఫలితం అనుకూలంగా రాకపోవడం వారిని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టింది. పీసీసీ చీఫ్ మొదలు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతల వరకు దుబ్బాకలో మకాం వేసి ఓటర్లను ఆకట్టుకొనేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, బీజేపీ గెలుపొందడంతో కాంగ్రెస్ నేతల్లో అయోమయం నెలకొంది. ఈ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్ పై జోరుగా చర్చ జరుగుతోంది.
ఆశలు అడియాశలు
2018 ముందస్తు ఎన్నికల్లో దుబ్బాకలో తమకు 26 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయని, ఈసారి అంతకన్నా ఎక్కువ వస్తాయనే ధీమాతో టీఆర్ఎస్ నుంచి వచ్చిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని బరిలోకి దింపింది కాంగ్రెస్. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు తోడు చెరుకు ముత్యంరెడ్డిపై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న సానుకూలత మరికొన్ని ఓట్లు రాలుస్తుందని ఆశలు పెట్టుకుంది. కానీ ఆ ఆశలు అడియాశలయ్యాయి. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఓట్లను రాబట్టుకొనేందుకు పని విభజన చేసుకొని మరీ టీపీసీసీలోని మహామహులంతా దుబ్బాకలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించినా ఆశించిన ఫలితం రాలేదు. ‘మా పార్టీకి చెందిన దాదాపు 150 మంది ముఖ్య నాయకులంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాలు, మండలాలవారీగా బాధ్యతలు తీసుకొని పనిచేశాం. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మాకే లాభిస్తుందని అంచనా వేశాం. కానీ మా వ్యూహం ఫలించలేదు. దుబ్బాక ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదు. ఉత్తమ్‌తోపాటు రేవంత్, భట్టి లాంటి నాయకులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన చోట్ల కూడా పార్టీకి లీడ్ రాలేదు. కేవలం పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి సొంత మండలంలో ఒక రౌండ్లోనే లీడ్ వచ్చింది’అని పీసీసీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
‘హుజూర్నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య పోటీ జరిగినప్పుడు బీజేపీకి కనీస స్థాయిలో ఓట్లు రాలేదు. దుబ్బాకలో మాత్రం టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య జరిగిన పోటీలో మాకు గౌరవప్రదమైన స్థాయిలో 22 వేల ఓట్లు వచ్చాయి. మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు కానీ, చెప్పుకోదగిన స్థాయిలోనే ఓట్లు వచ్చాయి. దుబ్బాక ఫలితాన్ని ఎలా అంచనా వేయాలో అర్థం కావడం లేదు’అని మరో కాంగ్రెస్ నేత అభిప్రాయపడ్డారు. ఇక ఏపీలో కాంగ్రెస్ గురించిన మాట వ స్తే ప్రస్తుతానికి అదొక్క గతించిన చరిత్రలా మారిపోయింది.