అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 15 నెలల ముందు ఉన్న ఫళంగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చేత బీజేపీ హై కమాండ్ రాజీనామా చేయించడం సంచలనం రేపింది. పార్టీలో వర్గ విభేదాలను అదుపుచేయలేక పోవడం, పరిపాలనలో వైఫల్యాలు వంటివాటిని కారణాలుగా చూపుతున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆరెస్సెస్ పెద్దలు చేయించిన ఒక సర్వే నివేదిక రూపానీ కుర్చీ కిందికి నీళ్లు తెచ్చిందని అంటున్నారు. పాటీదార్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండటం, పెరుగుతున్న ఆప్ ప్రభావం, సుదీర్ఘమైన బీజేపీ పాలనపై ప్రజలకు మొహం మొత్తడం వంటి అంశాలు వ్యతిరేక సంకేతాలు పంపుతున్నాయని, ఈ పరిస్థితుల్లో విజయ్ రూపానీ నేతృత్వంలో ఎన్నికలకు వెళితే ఓటమి తప్పదని ఆరెస్సెస్ స్పష్టం చేయడం వల్లే విజయ్ రూపానీని తప్పించారని ప్రచారం జరుగుతోంది.
ఆరెస్సెస్ నివేదికలో ఏం ఉంది?
ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్. వచ్చే ఏడాది డిసెంబరులో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. మొత్తం ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో మోదీ-షా ద్వయానికి స్వరాష్ట్రమైన గుజరాత్ లో విజయం అత్యంత కీలకం. 2017 ఎన్నికల్లోనే 99 సీట్ల బొటాబొటీ మెజారిటీతో బీజేపీ గట్టెక్కగలిగింది. వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి తలెత్తకుండా చూసేందుకు ఆరెస్సెస్ గుజరాత్ పై దృష్టి పెట్టింది. క్షేత్రస్థాయి పరిస్థితి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా సర్వే చేయించింది. బీజేపీకి పరిస్థితి ఏమంత అనుకూలంగా లేదని ఈ సర్వేలో తేలింది. ప్రధానంగా మూడు అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వేలో గుర్తించారు.
Also Read : బుడ్డా వెంగళ రెడ్డి – పేరు గుర్తుందా?
27 ఏళ్ల సుదీర్ఘ కాలం నుంచి రాష్ట్రాన్ని ఏలుతున్న బీజేపీపై ప్రజలకు సహజంగానే మొహం మొత్తింది. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. దాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోవడానికి ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలి.
గత ఎన్నికలకు ముందే రిజర్వేషన్ల కోసం పాటీదార్లు ఉద్యమించి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. దాని వల్లే ఆ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ తగ్గిపోయింది. ఇప్పుడు కూడా పాటీదార్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారిని సంతృప్తిపరిచి.. పార్టీ వైపు మళ్లించేందుకు వీలుగా పాటీదార్ నేతను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని ఆరెస్సెస్ నివేదికలో సూచించారు.
చాప కింద నీరులా ఆప్
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ చాప కింద నీరులా రాష్ట్రంలో విస్తరిస్తున్న విషయాన్ని ఆరెస్సెస్ ప్రముఖంగా ప్రస్తావించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆప్ విజయం సాధించిందని సర్వే తేల్చింది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ జన సంవేదన యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి.. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఆ ప్రభావం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో విజయ్ రూపానీని సీఎం అభ్యర్థిగా పెట్టి ఎన్నికలను ఎదుర్కొంటే ఓటమి తప్పదని ఆరెస్సెస్ హెచ్చరించింది. వెంటనే సీఎంను మార్చడంతోపాటు.. ప్రజా వ్యతిరేకతను తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించింది. దాంతో మోదీ-షా ద్వయం రంగంలోకి దిగి ఉన్న ఫళంగా విజయ్ రూపానీ చేత రాజీనామా చేయించారు.
Also Read : గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా