రాజకీయాల్లో చాలా నేర్పుతో ఉండాలి, అక్కడ మాట్లాడే మాట, వేసే అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. అలా కాకుండా ఏం చేసినా మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టుగా ఉంటాయి. ముఖ్యంగా హుజురాబాద్ లో ఒక నాటి కాంగ్రెస్ అభ్యర్థి నేడు టీఆర్ఎస్ పార్టీలో త్రిశంకు స్వర్గంలో తలకిందులుగా వేలాడుతున్న కౌశిక్ రెడ్డి పరిస్థితి అదే. 2018 సాధారణ ఎన్నికల్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు గట్టిపోటీ ఇచ్చిన కౌశిక్ రెడ్డిని ఉపఎన్నిక వేళ కాంగ్రెస్‌ను వీడి తమ గూటికి చేరేలా చేసింది గులాబీ దండు. అక్కడ ఈటెల మీద పోటీ చేసే అవకాశం దక్కుతుందని సంబర పడితే పక్కన పెట్టి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి సిఫారసు చేసింది టీఆర్ఎస్ కేబినెట్. పోనీలే ఎమ్మెల్యే కాకున్నా ఎలాంటి ఎన్నికల తలనొప్పులు లేకుండా ఎమ్మెల్సీ అయిపోయి అసెంబ్లీల అడుగు పెట్టచ్చని సంతోషపడ్డ కౌశిక్ రెడ్డికి అనుకోని షాక్ తగిలింది.
నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పంపిన సిఫార్సు పై గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు. సోషల్ సర్వీస్ చేసే వాళ్లకు ఇచ్చే ఎమ్మెల్సీ కాబట్టి నేనింకా ఆయన ఫైల్ స్టడీ చేయాలనీ గవర్నర్ చెబుతున్నారు. ఆమె నిర్ణయం కోసం ఎదురు చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. హుజురాబాద్ ఎన్నికకు ముందే ఎమ్మెల్సీ అయిపోయి ఆ హోదాలో ప్రచారం చేద్దామనుకున్న కౌశిక్ కలలకు గవర్నర్ తమిళిసై బ్రేకులు వేయడంతో ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి వ్యక్తి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా నియోజకవర్గంలో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్న పోలింగ్ నాడు కొన్ని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర పోలింగ్ తీరును పరిశీలించడానికి వెళ్లిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకుని తరిమి కొట్టినంత పని చేశారు.
నిజానికి ఆరోజు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి చివరి దాకా అభ్యర్థులే లేరు కాబట్టి రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నా, లేకపోయినా కౌశిక్ రెడ్డే అభ్యర్థి అయ్యేవాడు. టిఆర్ఎస్ కెసిఆర్, బిజెపి ఈటెల రాజేందర్ కొట్టుకోవడం కాకుండా కాంగ్రెస్ నుంచి కౌశిక్ కూడా ఉండి ఉంటే ప్రజలకు ఒళ్ళు మండి కౌశిక్ రెడ్డిని గెలిపించినా ఆశ్చర్యం లేదు. లేదు ఒకవేళ ఓడినా కాంగ్రెస్ అభ్యర్థిగా హుజురాబాద్ లో ఉండేవాడు. 2023 లో మళ్లీ ఆయనకే ఎమ్మెల్యే సీటు వచ్చేది. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను రంగంలోకి దింపారు కాబట్టి ఇప్పుడు ఓడినా 2023 లో ఆయనకే సీటు. బిజెపిలో ఈటెల గెలిచారు కాబట్టి 2023 లో కూడా ఆయనకే బీజేపీ సీటు. అయితే కౌశిక్ రెడ్డి ఒక్కడే ఇప్పుడు అటూ ఇటూ కాకుండా అయిపోయాడు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ అవుతాడో లేదో తెలియదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గెలిచారు కాబట్టి కేసీఆర్ నువ్వుండి నాకు ఉపయోగం ఏంటి అని ప్రగతి భవన్ తలుపులు మూసేసినా ఆశ్చర్యం లేదు. అలా ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయిపోయింది.చూడాలి చివరికి ఆయన పరిస్థితి ఏమవుతుంది అనేది .
Also Read : Huzurabad Bypoll- Etela Rajender : పదును తగ్గని ‘ఈట’ల.. ఉప ఎన్నికల్లో అపూర్వ విజయం