ప్రతి రంగంలో జీవితకాల లక్ష్యం అంటూ ఒకటుంటుంది.. రాజకీయాల్లో సహజంగానే ఉన్నత పదవి అందరి లక్ష్యం. ఎంత ఉన్నతం అనేది ఆయా నాయకుల స్థాయిని బట్టి ఉంటుంది. సోము వీర్రాజు లాంటి వారికి తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కావటం స్వీయ లక్ష్యం అయితే ఇతర రాష్ట్రాలలో మాదిరి తమ పార్టీని అధికారంలోకి తీసుకురావటం అనేది బహిరంగ లక్ష్యం అవుతుంది.. వర్తమాన కాల పరిస్థితుల్లో ఆంధ్రాలో బీజేపీకీ అధికారం అనేది అందని ద్రాక్షనే కాదు అందని ఉట్టి కూడా….
సోము వీర్రాజు అధ్యక్షుడైతే ఒక వర్గ మీడియాకు ఉలికిపాటు ఎందుకు?మొన్నటి ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి తరువాత చంద్రబాబు కుడి ఎడమ భుజాలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లతో సహా టీజీ వెంకటేష్,గరికపాటి రామ్మోహన్ రావ్ మొత్తం నలుగురు రాజ్యసభ సభ్యులు బిజేపీలో చేరి టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బిజేపీలో విలీనం చేసిన రోజు కూడా ప్రధాన మీడియా టీడీపీ మీద బీజేపీ దాడి అని రాయలేదు. మొక్కుబడి వార్త తప్ప విశ్లేషణలు, కథనాలు లేవు.. ఇప్పుడు మాత్రం బీజేపీ కన్నా లక్ష్మినారాయణను తప్పించి సోము వీర్రాజును అధ్యక్షుడిని చేస్తే “టార్గెట్ టీడీపీ” అని వార్తలు రాశాయి.
బీజేపీ తన రాష్ట్ర అధ్యక్షుడిని అదికూడా మూడు సంవత్సరాల పూర్తి పదవీ కాలం ముగిసిన తరువాత మారిస్తే కొందరికి ఉలికిపాటు ఎందుకు?. నిజంగా సోము వీర్రాజును చూసి భయపడుతున్నారా? లేక బీజేపీ అధిష్టానం ఆంధ్రా మీద దృష్టి పెట్టి తమ పార్టీ బలాన్ని పెంచుకోవటానికి ప్రణాళికలు రచిస్తుందని , తద్వారా కన్నా నాయకత్వంలో టీడీపీతో ఆడిన ఫ్రెండ్లీ గేమ్ ముగుస్తుందని ఆందోళనా?
ఎవరు ఈ సోము వీర్రాజు ?
దాదాపు 30 సంవత్సరాలు రాజకీయం జీవితంలో ఉన్నా 1994లోనే ఎమ్మెల్యేగా పోటీచేసినా సోము వీర్రాజు పేరు ఆంధ్రా బీజేపీ కార్యకర్తలందరికి 2014 వరకు పెద్దగా పరిచయం ఉన్న పేరు కాదు. 2014 ఎన్నికల సమయంలో జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ ను మోడీ వద్దకు తీసుకువెళ్లటంతో సోము వీర్రాజు పేరు పత్రికల హెడ్ లైన్స్ లోకి ఎక్కింది.
ధాటిగా మాట్లాడే సోము వీర్రాజు 2018లో టీడీపీ బీజేపీ పొత్తు విచ్చిన్నం అయిన తరువాత చంద్రబాబు కేంద్రప్రభుత్వం మీద ధర్మదీక్షల పేరుతో చేసిన ఆరోపణలను రాష్ట్ర బీజేపీ తరుపున తీవ్రంగా ఖండించాడు. ప్రత్యేకహోదా మీద చంద్రబాబు తీసుకున్న “U ” టర్న్ మీద దుమ్మెత్తిపోశాడు. “అందరికన్నా మనమే ఎక్కువ నిధులు సాధించాం”, “కేంద్రం అడిగిన వాటి కన్నా ఎక్కువే ఇచ్చింది” అని చంద్రబాబు గతంలో ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్స్ మీడియా ముందు చూపిస్తూ చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టాడు. సోము వీర్రాజుకు ప్రజల్లో ఎంత బలం ఉంది అన్న ప్రశ్నను పక్కనపెడితే అప్పటి వరకు జగన్ చేస్తున్న ఆరోపణలకు సోము వీర్రాజు ఆరోపణలు బలాన్ని ఇచ్చాయి.. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని తెలివిగా కేంద్ర ప్రభుత్వం మీదికి మరల్చాలని చంద్రబాబు చేసిన ప్రతి ప్రయత్నం టీడీపీకే నష్టం చేసింది.. “Bye Bye U Turn” బాబు అన్న ప్రచారం విస్తృతంగా ప్రజలలోకి వెళ్ళింది..
Also Read: ఎమ్మెల్సీ యోగం ఎవరికి దక్కుతుంది?
కరడుకట్టిన చంద్రబాబు వ్యతిరేకిగా పేరున్న కన్నా లక్ష్మీనారాయణ ఎవరికీ చెప్పకుండా ఒక్కడే ఢిల్లీకి వెళ్లి 2014 అక్టోబర్లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరాడు. నాలుగు సంవత్సరాలైనా బీజేపీలో గుర్తింపు దక్కలేదని వైసీపీలో చేరటానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని గుంటూరు నగరంలో ఫ్లెక్సీలు కట్టి ఇంక తెల్లారితే వైసీపీలో చేరిక అనగా ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ తో ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చేరాడు. ఒక నెలలో ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు.
దేశమంతా బీజేపీ పవనాలు వీచినా ఆంధ్రాలో సీట్లు గెలవటం కాదుకదా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఎన్నికల తరువాత కూడా జగన్ ప్రభుత్వం మీద ఔచిత్యం లేని ఆరోపణలు చేస్తూ టీడీపీ రహస్యమితుడన్న చెడ్డపేరు తెచ్చుకున్నాడు. బీజేపీ సీనియర్ నేత , రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహ రావ్ లాంటి వారి ప్రకటనలకు భిన్నంగా మాట్లాడుతూ చంద్రబాబుకు ఉపయోగపడ్డాడు.
కన్నా లక్ష్మీనారాయణకు ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరు అంటే ,రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారిలో కూడా ఎక్కువమంది సమాధానం చెప్పలేరు. కన్నా లక్ష్మీనారాయణ కన్నా ముందు అధ్యక్షుడిగా పనిచేసిన విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరి బాబు బీజేపీ తరుపున మీడియా ముందుకు వచ్చి చాలాకాలం అయ్యింది. టీడీపీ పొత్తులో భాగంగా మంత్రి పదవులు అనుభవించిన కామినేని శ్రీనివాస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేయటంలో బిజీగా ఉంటారు కానీ బీజేపీ పార్టీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించరు ,స్వయంగా ఏ కార్యక్రమం చేయరు. మరో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావ్ ఆర్ఎస్ఎస్ తో ఎదిగిన నాయకుడేకాని ఆయనకు సొంత నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో ఒక్క సర్పంచ్ ను కూడా గెలిపించుకునే బలం లేదు, బీజేపీకి ఆయన బలం కాదు.
బీజేపీకి ఎలాంటి నాయకుడు కావలి?
వ్యాపారాలు,రహస్య రాజకీయబంధాలు లేకుండా బీజేపీ అభివృధ్ధికోసం నిజాయితీగా పనిచేసే నాయకుడు ఉంటేనే ఆంధ్రాలో బలపడగలమని అమిత్ షా మరియు జేపీ నడ్డా భావించినట్లున్నారు. కేంద్ర నాయకత్వం ఆలోచనను ఆంధ్రాలో అమలుపరిచే నాయకుడు కావాలని అనుకున్నట్లున్నారు. అందుకే ఎన్నో లాబీలతో ప్రయత్నం చేసిన పురందేశ్వరిని మరికొందరిని కాదని సోము వీర్రాజును బీజేపీ అధక్షుడిగా ఎంపికచేశారు.
2015లో చంద్రబాబు బీజేపీ తరుపున సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇస్తానని ప్రతిపాదించగా – మీరు మా కేంద్ర నాయకత్వానికి చెప్పండి. వారు ఎవరిని ఎంపిక చేస్తే వారికే ఎమ్మెల్సీ ఇవ్వండి అని సోము వీర్రాజు చెప్పినట్లు అప్పట్లో బీజేపీ శ్రేణులు చెప్పుకున్నాయి. అమిత్ షా ఆమోదంతో ఆ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకే దక్కింది. చంద్రబాబుతో ఎలాంటి రాజకీయ సర్దుబాట్లు లేవు కాబట్టే పొత్తు విడిపోయిన తరువాత సీనియర్ నేతలు పెద్దగా స్పందించకపోయిన సోము వీర్రాజు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం మీద ఎదురుదాడికి దిగాడు.
సోము వీర్రాజుకు కలిసొచ్చిన అంశాలు
2014లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే సీట్ బీజేపీకి కేటాయించారు. రాజమండ్రి బీజేపీ బాధ్యతలను పాతిక సంవత్సరాలుగా చూస్తున్న సోము వీర్రాజు అనుకొని ఉంటే తానే పోటీకి దిగి ఉండవచ్చు కానీ ఆకుల సత్యనారాయణకు ఇప్పించాడు.
1998 లోక్ సభ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థి ఎంపికలో సోము వీర్రాజుదే కీలకపాత్ర. 1983లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి నాదెండ్ల వర్గంలో చేరటంతో రాజకీయంగా కనుమరుగైన గిరజాల స్వామి నాయుడుని రాజమండ్రి బరిలోకి దింపగా వాజ్ పాయ్ వేవ్ లో గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ లక్ష్మీపార్వతి వర్గంతో పొత్తుపెట్టుకుంది. లక్ష్మి పార్వతి వర్గం ఓట్ల వలన బీజేపీ నాలుగు స్థానాలు రాజమండ్రి ,కాకినాడ, సికింద్రాబాద్ మరియు కరీంనగర్ గెలిచిందని అనలేము కానీ రాజమండ్రి, కాకినాడ స్థానంలో మాత్రం లక్ష్మీపార్వతి వర్గం ఓట్లు కూడా బీజేపీ గెలుపులో కీలకమే!
1999 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఏర్పడటంతో గిరిజాల స్వామినాయుడిని కడియం ఎమ్మెల్యేగా పోటీకి దింపి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత మాజీ మంత్రి,ఎంపీ అయినా కపిలేశ్వరపురం జమిందార్,చెల్లూర్ షుగర్స్ ఓనర్ అయిన దివంగత S.B.P.B.K.పట్టాభి రామారావ్ తమ్ముడు సత్యనారాయణ రావుకు టికెట్ ఇప్పించారు, ఆయన గెలిచారు.
Also Read: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మళ్లీ ఎస్ఈసీ ఛాన్స్
ఈ వివరాలు చూస్తే తూర్పు గోదావరిలో సోము వీర్రాజు బీజేపీలో ఎంత కీలకమైన నేతనే అర్ధం అవుతుంది. సోము వీర్రాజు ప్రజా నేత కాదు, టీడీపీతో పొత్తు ఉన్నా 2004లో కడియం నుంచి ఓడిపోయాడు,2009లో రాజమండ్రి ఎంపీగా డిపాజిట్ సాధించలేకపోయాడు. కానీ ఇప్పుడు బీజేపీకి కావలసింది ఒక స్థానంలో గెలిచే నేత కాదు ,మనసావాచా పార్టీ అభివృద్ధికి కృషి చేసే నేత.. బీజేపీ కార్యకర్తల విశ్వాసం చూరగొనే నేత.. ఈ రెండు మెరిట్స్ సోము వీర్రాజుకు అధ్యక్షపదవిని కట్టబెట్టాయి..
సోము వీర్రాజు బాధపడుతున్న 18% ఓట్ల కథ ఏమిటి?
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో తాను మత రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్పుకోవటానికి తెగ తపించిపోయేవాడు. కమ్యూనిస్టుల మద్దతు కాపాడుకోవటానికి ప్రత్యేక శ్రద్ద చూపించేవాడు.
ఎన్టీఆర్ మరణించిన రెండు నెలలకు జరిగిన 1996 లోక్ సభ ఎన్నికల్లో లక్ష్మీపార్వతి వర్గం ఒక్కసీటు కూడా గెలవకుండా అడ్డుకోవటానికి తన సర్వ శక్తులను ఉపయోగించాడు. బలమైన ఎమ్మెల్యేలను, మంత్రులను లోక్ సభ బరిలోకి దించాడు.
ఆ ఎన్నికల్లో టీడీపీ 32.59 శాతం ఓట్లతో 16 స్థానాలు గెలవగా,మిత్రపక్ష కమ్యూనిస్టులు 3 స్థానాలు గెలిచారు. కాంగ్రెస్ 40 శాతం ఓట్లతో 22 స్థానాలు గెలిచింది.
లక్ష్మిపార్వతి వర్గం ఎన్టీఆర్ పెద్దకొడుకు జయశంకర్ కృష్ణ పోటీచేసిన శ్రీకాకుళంలో మాత్రం రెండవ స్థానంలో నిలిచింది. దాదాపు 12 స్థానాలలో లక్ష కన్నా ఎక్కువ ఓట్లు సాధించింది. మొత్తంగా 10.66 శాతంతో 32,49,276 ఓట్లు పొందింది కానీ ఒక సీట్ గెలవలేదు.బీజేపీ ఒక్కసీటు గెలవలేదు ,5.65 శాతంతో 17,20,850 ఓట్లు సాధించింది.
1998 ఎన్నికలు,
థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాలు కూలిపోవడంతో 1998లో మరోసారి లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో లక్ష్మీపార్వతి వర్గంతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అంతకుముందు పాతపట్నం శాసనసభ ఉప ఎన్నికలో బీజేపీ లక్షిపార్వతికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ ఉప ఎన్నికల్లో లక్ష్మీపార్వతి గెలవటంతో బీజేపీతో ఆవిడకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.
1998 ఎన్నికల్లో ఐదు చోట్ల పోటీ చేసిన లక్ష్మీపార్వతి వర్గం ఎక్కడా గెలవలేదు, శ్రీకాకుళంలో మరోసారి రెండవ స్థానం సాధించారు. బీజేపీ మాత్రం రాజమండ్రి, కాకినాడ, సికింద్రాబాద్ మరియు కరీంనగర్ లలో గెలిచింది. టీడీపీకి బలమైన రాజమండ్రి మరియు కాకినాడ స్థానాలు గెలవటం బీజేపీకి ఆంధ్రాలో కొత్త ఆశలు రేపింది.
ఆ ఎన్నికల్లో బీజేపీ 18.30 శాతంతో 58,36,394 ఓట్లు పొంది నాలుగు స్థానాలు గెలిచింది.
లక్ష్మీపార్వతి వర్గం 1.2 శాతంతో 3,84,211ఓట్లు పొందింది. కాంగ్రెస్ తన బలాన్ని నిలుపుకొని 38.46 శాతం ఓట్లు పొంది 22 స్థానాలు తిరిగి గెలిచింది. టీడీపీ 31.97 శాతం ఓట్లు పొంది 12 స్థానాలు గెలిచింది.,మిత్రపక్షాలు మూడు స్థానాలు గెలిచాయి.అంటే 1996లో టీడీపీ+ దాని మిత్రపక్షాలు గెలిచిన 19 స్థానాలలో నాలుగు స్థానాలు బీజేపీ + లక్ష్మీపార్వతి వర్గం 1998 ఎన్నికల్లో గెలిచింది అంటే బీజేపీ లాభం టీడీపీకి నష్టం ..
Also Read: వాక్సీన్ వచ్చే వరకూ కరోనాతో ప్రమాదమే!!
దీన్నిఅర్ధం చేసుకొనే 1999 ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకున్నాడు. వాజ్ పేయి హవా కావచ్చు,కార్గిల్ యుద్ధ ప్రభావం కావొచ్చు ఆ ఎన్నికల్లో టీడీపీ 29 ,బీజేపీ 7 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ కేవలం 5 స్థానాలకే పరిమితం అయ్యింది కానీ 42.79% ఓట్లు సాధించింది. టీడీపీ-బీజేపీ కూటమికి 50.75% ఓట్లు వచ్చాయి ..
1999ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోక పోయుంటే?
సోము వీర్రాజు మొన్న అన్నది 1998లో వచ్చిన 18% ఓట్ల గురించే . ఆ ఓట్లు అన్ని 1999లో టీడీపీ పొత్తుతో ఐస్ క్రీమ్ కరిగినట్లు కరిగిపోయాయి. ఈరోజు బీజేపీ పాటిస్తున్న రాజకీయ ఎత్తుగడలు ఆరోజు వేసి ఉంటే లక్ష్మీపార్వతి వర్గంతో 1999 ఎన్నికల్లో పొత్తుపెట్టుకొని ఉండేది లేదా ఆ వర్గాన్ని బీజేపీలో విలీనంచేసుకొని లక్ష్మీపార్వతిని రాష్ట్ర అద్యక్షురాలిని లేక జాతీయ కార్యదర్శినో చేసి 1999 ఎన్నికల్లో పోరాడేది. ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు అంచనా వేయటం లాజికల్ కాకపోయినా కచ్చితంగా 2009,2019 కన్నా మెరుగైన ఫలితాలు సాధించి ఉండేది.
2014లో మోడీ గెలిచిన తరువాత తమకు అవకాశాలుఉన్నాయని బీజేపీ గురించి దృష్టిపెట్టిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రా కూడా ఉండేది.
సోము వీర్రాజు ఏమి సాధించగలరు ?
టీడీపీ బలహీన పర్చటమే లక్ష్యంగా సోము వీర్రాజు పనిచేస్తారు అంటూ పత్రికల్లో వచ్చిన విశ్లేషణలు అర్ధసత్యాలు. ఏ రాష్ట్రంలోనైనా ఒక బలహీన పార్టీ శిధిలాల మీదే మరో పార్టీ ఎదుగుతుంది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలను వదిలేస్తే అధికారపక్షం,ప్రతిపక్షం రెండిటిలో ఎదో ఒకటి రాజకీయంగా సమాధి అయితేనే ఆ సమాధి మీద మరో పార్టీ ఉదయించేది..
కానీ ఆంధ్రాలో పరిస్థితులు పై విశ్లేషణకు అనుగుణంగా లేవు. టీడీపీ రాజకీయంగా సమాధి అయ్యే పరిస్థితి 2024లో రాదు. టీడీపీని మింగేసి బీజేపీ ఎదగటం కూడా సాధ్యం కాదు..
సోము వీర్రాజు అందరిని ఆశ్చర్యపరుస్తూ అటు అధికార వైసిపి మీద ఇటు టీడీపీ మీద దాడి కొనసాగిస్తారు. సోము వీర్రాజు లక్ష్యం బీజేపీ శ్రేణులను ఉత్సాహపర్చటం .. మన ఓట్లు మనకే అంటూ ఎన్నికలకు సిద్ధం చేయటం.. మిగిలినవన్నీ ద్వితీయ ప్రాధాన్యతలే!