తెలంగాణలో తాజా మార్పు ధరణి. అతి త్వరలో అతి కీలకమైన రెవెన్యూ శాఖ కార్యకలాపాలు జరిగేవి ఈ వెబ్ సైట్ నుంచే. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న దీనిపై ఎన్నో అనుమానాలు. ప్రజల ఆస్తులపై ప్రైవేటు వ్యక్తులకు చెందిన ధరణి యాప్ అప్పులు తీసుకునే అవకాశం ఉందని ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. చాలా పకడ్బందీగా ప్రభుత్వం దీన్ని రూపొందించినట్లు చెబుతోంది. ఈ నెల 29 నుంచే ఇది అందుబాటులో రానుంది. ఆస్తుల క్రయ, విక్రయాలకు చెందిన రిజిస్ట్రేషన్లు ఇక అందరూ దీని ద్వారా చేయాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఆ రోజు నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ధరణి వెబ్ సైట్ పని తీరు ఎలా ఉంటుంది..? వ్యవసాయదారుల్లో కొంత మంది నిరక్ష్యరాసులుంటారు. మరి అలాంటి వారి పరిస్థితేంటి..? వారేం చేయాలి..? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
రెండూ అక్కడే..
ఇప్పటి వరకూ ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఒక్కో పని ఒక్కో చోట జరిగేది. సబ్రిజిస్ట్రార్లు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేస్తే… మునిసిపల్, పంచాయతీ రికార్డుల్లో మ్యుటేషన్‌ను తహసీల్దార్లు చేసేవారు. తాజాగా రెండు పనులు తహసీల్దార్లే చేసేలా, సేవలందించే అంశంలో జాప్యం నివారించేలా ‘తెలంగాణ భూమి హక్కులు- పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం-2020’ను ప్రభుత్వం తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యుటేషన్ జరిగేలా చట్టంలో కీలక మార్పు చేసింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం యథావిధిగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే చేస్తారు. ఇప్పటి వరకు సాగు భూములకే పాస్ పుస్తకాలు ఉండగా, ఇక నుంచి వ్యవసాయేతర భూములకూ ఇవ్వననున్నారు. ఆస్తి పత్రాలతో పాటు ఇక నుంచి ఇది కూడా యజమానుల దగ్గర ఉండాల్సిందే.
స్లాట్ తప్పనిసరి
ఆర్టీఏ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాల్సిందే. ఇక నుంచి రెవెన్యూ విభాగంలోనూ ఈ కొత్త తరహా విధానం అందుబాటులోకి రానుంది. వ్యవసాయ భూములను విక్రయించే రైతులు/కొనుగోలుదారులు పోర్టల్‌లోకి వెళ్లి ‘అగ్రికల్చర్’ బటన్‌పై క్లిక్ చేసి… స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ క్రమంలో రైతులు/కొనుగోలుదారులు సమగ్ర వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. స్లాట్ బుక్‌చేసుకున్న సమయానికి కార్యాలయంలో అడుగుపెడితే సాంకేతిక సమస్యలు, సర్వర్ ప్రాబ్లమ్ లేకుంటే అరగంటలోనే రిజిస్ట్రేషన్/మ్యుటేషన్లు జరిగిపోనున్నాయి. ఆధార్‌కార్డులోని ఫొటోనే పాస్‌పుస్తకం ప్రధాన పేజీలో ముద్రితం కానుంది. లోపాలకు ఏ మాత్రం అవకాశం లేకుండా పోర్టల్‌ను తీర్చిదిద్దారు.
రిజిస్ట్రేషన్ తో పాటే మ్యుటేషన్
వ్యవసాయేతర ఆస్తుల(ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్లు, వాణిజ్య స్థలాలు) రిజిస్ట్రేషన్లు.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్ కాగానే మ్యుటేషన్ చేసే బాధ్యత కూడా సబ్ రిజిస్ట్రార్‌దే. ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మ్యుటేషన్ కోసం మునిసిపాలిటీలు/పంచాయతీల్లో దరఖాస్తు చేసుకుంటే… ఆ తర్వాతే రికార్డుల్లో పేర్లు చేరేవి. దీన్ని సవరించి.. కొన్ని మార్పులు చేశారు. ఆ తర్వాత వ్యవసాయేతర ఆస్తుల యాజమానులకు మెరూన్ కలర్ పాస్‌బుక్ జారీ చేయనున్నారు. ఇప్పటిదాకా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం అమలులో ఉన్నా తప్పనిసరి చేయలేదు. ఇకపై స్లాట్ బుక్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్లకు అనుమతించరు. పోర్టల్‌లో ఆధార్, పట్టాదారు పాస్‌పుస్తకాలు, పాన్‌కార్డు వివరాలు పొందుపరిచి, ఈ-చలాన్ చెల్లించాకే స్లాట్ బుక్ అవుతుంది. ఆ మేరకు నిర్ణీత సమయానికి తహసీల్దార్/సబ్ రిజిస్ట్రార్ ముందు ఉండాలి.