ఎప్పుడైతే కరోనా వైరస్ చైనా నుండి ప్రపంచ దేశాలకు వ్యాపించిందో అప్పటినుండి ప్రపంచ దేశాలు చైనాపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అయిన అమెరికా చైనాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అనేక సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా తన ఆగ్రహాన్ని చైనాపై వ్యక్తం చేశారు. చైనాకు చెందిన అనేక సంస్థలను అమెరికాలో రహస్యాలను చైనాకు చేరవేస్తున్నాయన్న కారణంగా చైనాకు చెందిన కంపెనీలను అమెరికాలో ట్రంప్ నిషేధించిన విషయం తెలిసిందే.
అలా నిషేధం విధించిన వాటిలో చైనా మొబైల్ దిగ్గజం హువావేతో పాటు టిక్ టాక్,వీ చాట్ లాంటి సంస్థలు ఉన్నాయి. వీటిలో టిక్ టాక్ మరియు వీ చాట్ సంస్థలకు 45 రోజుల గడువు ఇస్తూ ఆలోగా అమెరికా కంపెనీలకు విక్రయించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కూడా విడుదల చేశారు. కాగా అమెరికా వ్యాఖ్యలపై చైనా ఇప్పుడు ఎదురుదాడికి దిగింది. వీ చాట్ ను అమెరికాలో నిషేధిస్తే అమెరికాకు చెందిన ఆపిల్ ఉత్పత్తులను చైనాలో నిషేధిస్తామని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ట్వీట్ చేశారు. వీ చాట్ ను నిషేధించిన తర్వాత అమెరికా ఉత్పత్తులు వాడటంలో అర్థం లేదని జావో లిజియన్ వెల్లడించారు. చైనా ఎదురుదాడికి దిగడంతో అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.