ఐదు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న వరంగల్ దుస్థితి తెలిసిందే. దీంతో సర్కారు ఇందుకు గల కారణాలపై దృష్టి పెట్టి అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించాలని అధికారులను ఆదేశించింది. ప్రధానంగా చెరువులు, నాలాలపై దృష్టి పెట్టాలంది. అధికారులు ఆ దిశగా కూల్చివేతలు ప్రారంభించారు. అయితే వరంగల్ ఎపిసోడ్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ పై ప్రభావం చూపుతోంది. గట్టిగా ఓ గంట వర్షం పడితే మహా నగరంలో కలిగే ఇక్కట్లు ఇక్కడి ప్రజలకు అనుభవమే. మూడు, నాలుగు సెంటి మీటర్ల కంటే ఎక్కవ వర్షపాతం నమోదైతే చాలు.. జలమయం అవుతుంది. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. పరీవాహక ప్రాంతాల ప్రజలు భయంతో ఒణికి పోతున్నారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లో కూడా లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. రెండేళ్ల క్రితం వర్షాలకు హైదరాబాద్ లోని కొన్ని ఏరియాలు రోజుల తరబడి జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ పరిస్థితికి కారణం అక్రమ నిర్మాణాలు అని చాలా ఆరోపణలు వచ్చాయి.
లేక్ లెస్ సిటీగా…
ప్రస్తుతం నీట మునిగిన వరంగల్ తో పోల్చుకుంటే హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలకు కొదవ లేదు. చాలా చెరువులు, కుంటల్లో కాలనీలు వెలిశాయి. ఒకప్పుడు లేక్ ఆఫ్ ద సిటీగా పేరొందిన హైదరాబాద్ నేడు లేక్ లెస్ సిటీగా మారింది. వేలాది చెరువులు ఉన్న స్థానంలో నేడు 185 కి మించి లేవని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఆ చెరువుల్లో కూడా చాలా భాగాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. బఫర్, శికం జోన్లో కొన్ని చోట్ల వెంచర్లు కూడా వెలిశాయి. నగరంలో కూడా ఈ అక్రమ నిర్మాణాల వల్ల చాలా ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. వరంగల్ లో మొదలైన అక్రమ నిర్మాణాల కూల్చివేతల నేపధ్యంలో హైదరాబాద్ లో వాటిపై దృష్టి పెట్టాలని యంత్రాంగం ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరిగాయి. వర్షాల నేపధ్యంలో ఈ సారి మళ్లీ భారీ స్థాయిలో చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో ముందుగా దృష్టి పెట్టనున్నారు.