వలంటీర్ల వ్యవస్థ వేస్ట్. ఆ ముసుగులో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పించేందుకు జగన్ ఈ వ్యవస్థను తీసుకొస్తున్నారు.. అని అధినేత చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. కొత్త వ్యవస్థపై నాడు అక్కసు వెళ్లగక్కారు. కానీ ఆ వ్యవస్థ ప్రభావం, ఉపయోగం ఏమిటో ఇప్పుడు చంద్రబాబుకు తెలిసి వచ్చింది. నాడు తిట్టిపోసిన వ్యవస్థ తరహాలోనే తమ పార్టీ పరంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు రోజులపాటు నిర్వహించిన టీడీపీ సమావేశాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ తరపున వలంటీర్లను నియమించాలని.. ఈ నెల 15లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు.
వారధిలా ప్రభుత్వ వలంటీర్లు
పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ పథకాలను చేర్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరును నియమిస్తామని ప్రజాసంకల్ప యాత్రలోనే జగన్ ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీకి కట్టుబడి స్థానిక పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి దానితో వలంటీర్లను అనుసంధానం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలన్నీ శరవేగంగా.. పార్టీలకు అతీతంగా ప్రజలకు అందుతున్నాయి. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ వ్యవస్థను అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి చర్యలు చేపట్టాయి.
Also Read : వీర్రాజు ఇంత వేగంగా మారిపోయారేమీ..?
వారికి ఆదర్శం.. వీరికి ఉక్రోషం
ఏర్పాటు చేసిన స్వల్పకాలంలోనే సచివాలయ, వలంటీర్ వ్యవస్థ పరిపాలనలో కీలకంగా మారింది. వలంటీర్లు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వ పథకాలు అందిస్తూ తలలో నాలుకలా వ్యవహరించడమే కాకుండా, పార్టీలకు అతీతంగా పనిచేస్తూ మన్ననలు అందుకుంటున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మారారు. అత్యంత ఉపయోగకరంగా ఉన్న ఈ వ్యవస్థను చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటుండగా రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ కి మాత్రం కంటగింపుగా మారింది. వైస్సార్సీపీకి మేలు చేసేందుకే వలంటీర్లను నియమించారని నిందలు మోపడంతోపాటు స్థానిక ఎన్నికల సమయంలో వలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించవద్దంటు ఎన్నికల సంఘానికి, హైకోర్టుకు వెళ్లి నానా రచ్చ చేసింది. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో పెత్తనం అంతా వాటికే కట్టబెట్టారు. టీడీపీ వారికే పథకాలు మంజూరు చేస్తూ.. అందులోనే మామూళ్లు దండుకుంటూ ఆ కమిటీలు దోపిడీ కమిటీలుగా మారాయి. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కూడా అవి ఒక కారణమయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన సచివాలయ, వలంటీర్ వ్యవస్థ కూడా అలాగే ఉంటుందనుకున్నారు. కానీ అవి పార్టీ రహితంగా పని చేస్తూ సర్వజనామోదం పొందడంతో.. దాన్ని కాపీ కొట్టేందుకు చంద్రబాబు సిద్ధపడ్డారు.
ఆ వ్యవస్థే పెడతారట
వలంటీర్ వ్యవస్థనే రద్దు చేయాలన్నట్లు మాట్లాడిన చంద్రబాబు తాజాగా పార్టీ పరంగా అటువంటి వ్యవస్థనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల రెండు రోజులపాటు జరిగిన పార్టీ సమావేశాల్లో ఈ మేరకు నేతలకు దిశానిర్దేశం చేశారు. బూత్, వార్డు, గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని.. అందులో భాగంగా ప్రతి వందమంది ఓటర్లకు ఒక వలంటీరును కార్యకర్తల నుంచి నియమించాలని ఆదేశించారు. ఈ నెల 15లోగా నియామకాలు పూర్తి కావాలని టార్గెట్ పెట్టారు. ఈ వలంటీర్లు ఓటర్లను కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసేలా చూడటం వలంటీర్ల బాధ్యత. ఇప్పుడు స్వచ్ఛందంగా పని చేసే వారినే.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ వలంటీర్లుగా నియమిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అంటే ప్రభుత్వ వలంటీర్లు పథకాలు, పింఛన్లు, రేషన్, ఇతర ప్రయోజనాలు అందిస్తుంటే.. టీడీపీ వలంటీర్లు ఓట్లు దండుకోవాలట! కానీ ప్రజలు దీన్ని ఆమోదిస్తారా.. తమ ఇళ్ల వద్దకు వారిని రానిస్తారా.. అన్నదే ప్రశ్న.
Also Read : కుప్పంపై బాబు ప్రేమ.. వదిలిపెట్టి పోరట..!