రాజకీయాల్లో వారసుల హవా ఈనాటిది కాదు. సుదీర్ఘకాలంగా సీనియర్ నేతలు తమ బిడ్డలను రాజకీయాల్లోకి తీసుకురావడం చూస్తున్నాం. కానీ అందులో కొందరే సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా కుమారులను తమ వారసులుగా ప్రకటించిన నేతలు వారిని ప్రోజెక్ట్ చేసేందుకు పలు విధాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ విజయనగరం రాజకీయాల్లో వారసురాళ్ల హవా కనిపిస్తోంది.
కీలకనేతలంతా తమ కుమార్తెలను రాజకీయంగా ప్రోత్సహించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి హోదాలో అదే జిల్లా నుంచి పాముల పుష్ప శ్రీవాణీ రాణిస్తున్నారు. మెట్టినింటి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఆమె ఉన్నారు.
ఇక విజయనగరం జిల్లా కేంద్రంలో కూడా యువతుల హవా మొదలు కాబోతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కీలక నేతలను అందించిన విజయనగరంలో సీనియర్లంతా తమ వారసురాళ్లను ప్రోత్సహంచే పనిలో ఉన్నారు. గత ఎన్నికల్లోనే విజయనగరం అసెంబ్లీ టికెట్ ని తన కుమార్తె కోసం మాజీ కేంద్రం మంత్రి అశోక్ గజపతిరాజు ఆశించారు.
ఆయన మంత్రిగా హస్తినలో ఉన్న కాలంలోనే విజయనగరం వ్యవహారాల్లో అతిథి గజపతిరాజు జోక్యం చేసుకున్నారు. ముఖ్యంగా మాన్సాస్ ట్రస్ట్ సభ్యురాలిగా ఆమె చక్రం తిప్పారు. ఆయన ఆశించినట్టుగా మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా రాబోయే రోజుల్లో ఆమె కీలకంగా వ్యవహరిస్తుందని అశోక్ వర్గీయులు భావిస్తున్నారు. విజయనగరం గజపతి రాజుల వారసత్వాన్ని ఆమె నిలబెడుతుందని అశోక్ శిబిరం ఆశాభావంతో ఉంది.
అయితే అనూహ్యంగా ఆనంద్ గజపతిరాజు వారసత్వంతో సంచయిత ఇప్పుడు కీలకంగా మారుతున్నారు. ఆమె ఇప్పటికే మాన్సాస్ చైర్ పర్సన్ హోదాలో రాజకీయంగాను పాగా వేసే పనిలో ఉన్నారు. గతంలో బీజేపీలో కీలకంగా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం వైఎస్సార్సీపీ నేతలత సన్నిహితంగా ఉన్నారు. దాంతో ఆమె త్వరలో పూర్తిస్థాయిలో ఆపార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. మాన్సాస్ పేరుతో అన్ని కీలక వ్యవహారాల్లోనూ ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విజయనగరం రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలనే తాపత్రయంతో ఆమె ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో మరో సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కూడా తన కుమార్తెను ముందుకు తీసుకురావడం విశేషంగా మారుతోంది. కోలగట్ల శ్రావణి ఇప్పటికే రాజకీయంగా చురుగ్గా సాగుతున్నారు. విజయనగరంలోని అన్ని ప్రధాన కార్యక్రమాల్లోనూ ఆమె దర్శనమిస్తున్నారు. రాజకీయంగా అందరినీ ఆకట్టుకునే పనిలో ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగానూ, ఒకసారి ఎమ్మెల్సీగానూ వ్యవహరించిన వీరభద్రస్వామి వారసత్వాన్ని ఆయన చిన్న కుమార్తె అందిపుచ్చుకుంటుందనే అభిప్రాయం బలపడుతోంది. తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు వస్తుందని స్వామి శిబిరం భావిస్తోంది. దాంతో విజయనగరంలో వారసురాళ్ల హవా మొదలవుతుందనే చెప్పవచ్చు
అదే సమయంలో ఏపీ రాజకీయాల్లోనే కీలకంగా ఎదిగిన బొత్సా కుటుంబ వారసత్వం మాత్రం చిన్న శ్రీను తో సరిపెట్టుకుంటున్నట్టుగా ప్రస్తుతానికి కనిపిస్తోంది. బొత్సా కుటుంబం నుంచి ఆయన బిడ్డలు గానీ, ఇతరులు గానీ క్రియాశీలకంగా కనిపించడం లేదు. దాంతో చిన్న శ్రీను హవా మరింతగా పెరగడానికి ఆస్కారం ఉందని భావిస్తున్నారు.
ఏమయినా కీలకనేతలంతా తమ కుటుంబీకులను ప్రోత్సహించే పనిలో ఉత్సాహంగా ఉండడం, అందులోనూ విజయనగరం అమ్మాయిలు జోరుగా ఉండడం చర్చనీయాంశంగానే చెప్పవచ్చు. 2014-19 మధ్యకాలంలో మహిళా ఎమ్మెల్యేగా మీసాల గీత ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో భవిష్యత్తులో మరింత మంది మహిళా నేతలు పోటీపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.