బెజవాడ రాజకీయాలు ఇప్పుడు టీడీపీ అధినేతకి తలనొప్పిగా మారాయి. కుప్పం ఫలితాలతో కలత చెందుతున్న వేళ బెంబేలెత్తిస్తున్నాయి. నిన్నటి వరకూ అంతోఇంతో ఆశగా కనిపించిన నగరం ఇప్పుడు కలవరపెడుతోంది. దాంతో తెలుగుదేశం నేతలు తలలుపట్టుకుంటున్నారు.
కేశినేని నాని మంచి కాక మీద ఉన్నారు. తనకు సెగ పెట్టాలని చూస్తున్న బుద్ధా వెంకన్న అండ్ బ్యాచ్ కీ గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్లుగా నా దారి రహదారి అంటూ బయలుదేరారు. ఆరుగురు ఓడిపోయిన చోట తాను ఎంపీగా గెలిస్తే, నాకే పొగబెడతారా అంటూ ఫైర్ అయ్యారు. ఏకంగా పార్టీకే వార్నింగ్ ఇచ్చారు. తద్వారా పరోక్షంగా లోకేష్ ని హెచ్చరించినట్టు కనిపిస్తోంది.
వారం రోజులుగా బెజవాడలో తెలుగు తమ్ముళ్ల తగాదా రోడ్డెక్కినది. కొన్నాళ్లుగా అంతర్గతంగా ఉన్న విబేధాలు ఎంపీ వర్సెస్ ఇతర నేతలు అన్నట్లుగా మారింది. మున్సిపల్ ఎన్నికల నగారా మొగడంతో వ్యవహారం ముదిరిపాకన పడింది. కేశినేని కుమార్తె మేయర్ సీటు బరిలో నిలవడంతో ఆమెకి చెక్ పెట్టేందుకు బుద్ధా వెంకన్న, పట్టాభి సహా పలువురునేతలు ఒక్కటయ్యారు. బోండా ఉమా వంటి వారు వారికి తోడయ్యారు. దీన్ని గ్రహించిన కేశినేని తాజా హెచ్చరికల తర్వాత ఆపార్టీ నేతల తీరు ఎలా ఉంటుందోననే చర్చ మొదలైంది.
ఓవైపు వెస్ట్ నియోజకవర్గంలో నాగుల్ మీరా బాబుకి బైబై చెప్పేస్తున్నారు. కీలకమైన సీనియర్ నేత టీడీపీ ని వీడి వైఎస్సార్సీపీ కి జై కొడుతుండడం తెలుగుదేశాన్ని తలెత్తుకోకుండా చేస్తోంది. మైనార్టీ వర్గానికి చెందిన కీలక నేతఅనుచరులతో కలిసి సైకిల్ దిగాలని నిర్ణయించుకోవడంతో టీడీపీ విజయవాడ మేయర్ సీటు మీద పెట్టుకున్న ఆశలకు నీళ్ళొదులుకోవాల్సి వస్తోంది.అదే సమయంలో వర్గపోరు టీడీపీ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తలోదిక్కుగా మారిన తమ్ముళ్ల తీరుతో టీడీపీ పరిస్థితి తలకిందులుగామారుతోంది. అదే సమయంలో కేశినేని నానిని ఎలా కంట్రోల్ చేయాలన్నది అంతుబట్టక టీడీపీ అధిష్టానం తలలుపట్టుకుంటోంది.