రామతీర్థం ఆలయంలోని కోదండ రాముడి విగ్రహం ధ్వంసంపై ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని ఆరోపించారు. రామతీర్థంలోని రాముని విగ్రహం ధ్వంసం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. అందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఖచ్చితంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ నాయకులు ఈ కుట్ర పన్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
పునఃప్రతిష్ట ఏర్పాట్లు జరుగుతున్న సయంలో..
మరోవైపు విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండరామాలయంపై దుండగుల దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అర్ధరాత్రి ఆలయంలో ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు గుర్తించారు. శ్రీరాముని విగ్రహానికి సంబంధించిన శిరస్సు భాగాన్ని ఆలయంలోని రామకొలనులో గుర్తించారు. అనంతరం జై శ్రీరాం నినాదాల మధ్య శిరస్సును ఆలయానికి చేర్చారు. చినజీయర్ స్వామి ఆశ్రమం ప్రతినిథులతో శిరస్సు పునఃప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శ్రీరాముడి విగ్రహ ధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రంగంలోకి యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఆలయాల పరిరక్షణ యాత్ర..? లేకుంటే ప్రశాంతమైన రాష్ట్రంలో చిచ్చురేపే యాత్రా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటన
“రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు నిత్యకృత్యం అవడం దురదృష్టకరం. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు. కనీసం గుళ్లో ఉన్న దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ అలసత్వ తీరు వల్లే ఈ దాడులు చోటు చేసుకుంటున్నాయి. రాజమండ్రిలో విఘ్నేశ్వర ఆలయంలో సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని విధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. విజయవాడలో దుర్గమ్మ గుడిలో మాయమైన 3 సింహాలను ఇప్పటివరకు గుర్తించలేదు. అంతర్వేదిలో రధం తగులబెట్టిన నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే ప్రజల ఆగ్రహానికి గురవ్వక తప్పదు. రామతీర్థం ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకుంది? మొదటి సారి దాడి జరిగినప్పుడే చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాష్ట్రంలో అన్ని మతాల ప్రజల మనోభావాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దేవాలయాలపై దాడులు చేసిన వారిలో ఇప్పటి వరకు ఎంత మందిని ప్రభుత్వం గుర్తించిందో ప్రజలకు చెప్పాలి. దేవాలయాల పరిధిలోని సీసీ టీవీ ఆధారాలను బయటపెట్టాలి. వరుస దాడులు జరుగుతున్నా జగన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారు.? జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిందూ ధర్మాలకు, సాంప్రదాయాలకు కళ్లెం పడింది. అంతేకాకుండా దేశంలోనే ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో దేవుళ్లపై దాడులు జరుగుతున్నాయి. వరసగా చోటు చేసుకుంటున్న ఈ దురాగతాల నివారణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలి.” అంటూ బాబు లేఖ విడుదల చేశారు.
ఇదో రాజకీయమా..?
అంతకంతకు దిగజారుతున్న పార్టీ ప్రతిష్ట కాపాడుకోవడానికే బాబు నిత్యం ఏదో వివాదాలను రేపుతున్నారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. గతంలో ఎన్నడూ జరగని మత రాజకీయాలు రాష్ట్రంలో ఏడాది కాలంగా కనిపిస్తున్నాయి. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎక్కడా కనిపించడని టీడీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు, ఘటనల విషయంలో మాత్రం ఉత్సాహం చూపుతున్నారు. సున్నితమైన అంశాల పట్ల జాగూరుతతో వ్యవహరించి ప్రజలు భావోద్వేగాలకు గురి కాకుండా వ్యవహరించాల్సింది పోయి రాజకీయ లబ్ది కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేవాలయాలపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, అంతర్వేది ఘటనలో ప్రతిపక్షాలు డిమాండ్ కు ముందే జగన్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడీ ఆలయ పరిరక్షణ యాత్ర ఉద్దేశం ఏంటో ప్రజలందరికీ తెలుసునని వైసీపీ నేతలు చెబుతున్నారు.