కృష్ణ పరివాహక ప్రాంతం పులకరిస్తుంది.వాగులు, వంకలు,ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి .ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని భీమా, నెట్టంపాడు,జూరాల కింద ఉన్న కాలువలకు నీటిని వదులుతున్నారు. జూరాల దాదాపు నిండింది, ప్రస్తుతం 9 టీఎంసీల నీరు ఉంది.
ఆంధ్రా విషయానికొస్తే నిన్న సాయంత్రం 9 గంటలకు 74 టీఎంసీల నీరు శ్రీశైలం రిజర్వాయర్‌లో ఉంది. గత సంవత్సరం ఇదే సమయానికి(22-Jul-2019) శ్రీశైలంలో 42 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నిన్న ఒక లక్షా రెండు వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. శ్రీశైలంలో నీటి మట్టం 847 అడుగులకు చేరింది. ఈ రోజు పోతిరెడ్డిపాడు మరియు హంద్రీ-నీవా ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేయటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
కేసి కెనాల్‌కు నీరు ఇచ్చే తుంగభద్ర మీద ఉన్న సుంకేసుల డ్యామ్ పూర్తిగా నిండింది. ఎప్పుడూ ఎండిపోయి కనిపించే గాజులదిన్నె ప్రాజెక్ట్ కూడా దాదాపు (4.20 టీఎంసీ) నిండింది. ఈ ప్రాజెక్టును హంద్రీ నది మీద కోడుమూరు మండలం లద్దగిరి వద్ద నిర్మించారు. హంద్రీ నది కర్నూల్ టౌన్ మధ్య నుంచి పారుతుంది.. నిండుగా పారుతున్న హంద్రీ నది కర్నూల్ ప్రజలకు కనువిందు చేస్తుంది.
ఇప్పుడు కృష్ణాకు వస్తుంది పూర్తిస్థాయి వరద కాదు, ఎక్కువ రోజులు కొనసాగకపోవచ్చు. కొన్ని వారాల తరువాత పెద్ద వరద వస్తుందని నా అంచనా, అప్పుడు అన్ని రిజర్వాయర్లు 70-80% నిండటానికి అవకాశం ఉంటుంది. కృష్ణ నది కింద అన్ని ప్రాజెక్టులు కలిపి 601 టీఎంసీ ల స్టోరేజి సామర్ధ్యం ఉండగా ప్రస్తుతం 271.40 టీఎంసీ ల నీరు ఉంది.
Also Read:కొత్త మంత్రులు కొలువదీరేది నేడే
శ్రీశైలంలో 74 టీఎంసీలు, నాగార్జున సాగర్‌లో 174 టీఎంసీలు,పులిచింతలలో 10.50 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజిలో 2.96(పూర్తి కెపాసిటీ 3.07టీఎంసీ) నీరు ఉంది. అన్ని రిజర్వాయర్లు నిండే వరకు ఎదురు చూడకుండా కాలువల పూర్తి సామర్ధ్యం మేర నీటిని వదలాలి. కాలువల కింద ఉన్న రిజర్వాయర్లు నింపాలి.
గత రాత్రి 9 గంటలకు వివిధ నీటి ప్రాజెక్టుల్లో స్టోరేజి వివరాలు కింది ఫొటోలో చూడండి
ముఖ్యంగా పోతిరెడ్డిపాడు మీద ఆధారపడ్డ తెలుగు గంగ కాలువ మీద ఉన్న వెలిగోడు ,బ్రహ్మం సాగర్ ,SRBC గోరకల్లు,GNSS గండికోట ప్రాజెక్టులకు, హంద్రీ-నీవా పరిధిలోని జీడిపల్లి, గొల్లపల్లికి నీటిని వదలటం మొదలు పెట్టాలి. బ్రహ్మం సాగర్ లో ఈ సంవత్సరం అయినా 10 టీఎంసీ ల నీరు నింపే మార్గం వెతకాలి.
స్థూలంగా శ్రీశైలం సర్వీస్ ఆపరేషన్ రూల్స్ సడలించి రిజర్వాయర్లు నింపే పనిచేపట్టాలి, లేదంటే ప్రకాశం బ్యారేజి కింద ఈ సంవత్సరం కూడా వందల టీఎంసీ లు నీరు సముద్రంలోకి వదులుకోవలసి వస్తుంది.
లక్ష్యం దిశగా వెలిగొండ
మూడు దశబ్దాలుగా ఎదురు చూస్తున్న వెలిగొండ పనుల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రకటించినట్లు హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. మూడు రోజుల కిందట హెడ్ రెగ్యులేటర్ కు గేట్లు బిగించారు. గేట్లు బిగించటం వలన ఇప్పుడు వస్తున్న వరద మూలంగా పనులకు ఎటువంటి ఆటంకం ఎదురుకాదు. మొదట జూన్ 25కు గేట్లు బిగించటం పూర్తి చెయ్యాలని భావించారు కానీ అవాంతరాలు ఎదురు కావటం వలన దాదాపు 20 రోజులు ఆలస్యంగా గేట్ల పనులు పూర్తిచేశారు.
Also Read:బెంగాల్.. దంగల్.. : అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
ఇప్పుడు అందరి చూపు మొదటి టన్నెల్ పనుల మీద ఉంది. 18.82 కి.మీ పొడవైన మొదటి టన్నెల్ లో ఇంకా 590 మీటర్లు తవ్వవలసిఉంది. TBM(Tunnel Boring Machine) రోజుకు 6 నుంచి 8 మీటర్లు తోవ్వగలుగుతుంది.అంటే మరో 85 రోజుల్లో మొదటి టన్నెల్ పనులు పూర్తి కావటానికి అవకాశం ఉంది. అక్టోబర్ చివరిలో లేకుంటే నవంబర్ రెండవ వారం లోపు ట్రయిల్ రన్ జరపొచ్చు. అదే జరిగితే మూడు దశాబ్దాలుగా పశ్చిమ ప్రకాశం,కడప జిల్లా బద్వేల్,నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంత వాసులు కల మొదటి దశపూర్తయినట్లే.
మొదటి టన్నెల్ పూర్తయి నీరు పారటం గొప్ప విజయమే కానీ పూర్తి స్థాయిలో నీళ్లు రావాలంటే రెండవ టన్నెల్ కూడా పూర్తి కావాలి. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ 18.82 కి.మీ పొడవు,7 మీటర్ల వ్యాసంతో(Diameter) తో 3000 క్యూసెక్కుల డిశ్చార్జ్ కెపాసిటితో డిజైన్ చేసారు. అంటే మొదటి టన్నెల్ నుంచి రోజుకు 0.25(పావు) టీఎంసీ నీటిని మాత్రమే ఇవ్వగలరు.
రెండవ టన్నెల్ 18.838 కి.మీ పొడవు,9.20 మీటర్ల వ్యాసంతో(Diameter) తో 8,582 క్యూసెక్కుల డిశ్చార్జ్ కెపాసిటితో డిజైన్ చేసారు. అంటే రెండవ టన్నెల్ నుంచి రోజుకు 0.75(ముప్పావు) టీఎంసీ నీటిని ఇవ్వగలరు.
ఈ లెక్కలు చూస్తే రెండవ టన్నెల్ పూర్తయితేనే వెలిగొండ ప్రాజెక్ట్ లక్ష్యం నెరవేరినట్లు.రెండు టన్నెల్లు పూర్తి అయితే రోజుకు ఒక టీఎంసీ(11,547 క్యూసెక్స్) నీటిని తీసుకోవచ్చు. వెలిగొండ నీటిని నిలువచేసే నల్లమల సాగర్ నిలువ సామర్ధ్యం 40 టీఎంసీల పైనే.
రెండవ టన్నెల్ పనులును గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసేసింది. 2014 మే నాటికి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి మొదటి టన్నెల్ 12.06 కి.మీ,రెండవ టన్నెల్ 8.747 కి.మీ పూర్తి అయ్యాయి. చంద్రబాబు ఐదేళ్ల పదవి కాలంలో మొదటి టన్నెల్ 4.5 కి.మీ ,రెండవ టన్నెల్ దాదాపు 2.5 కి.మీ తవ్వారు. అంటే సగటున సంవత్సరానికి ఒక కి.మీ కూడా తవ్వలేదు.
రివర్స్ టెండర్లో మేఘా వెలిగొండ ప్రాజెక్టు MEIL(మేఘా) వాళ్లకు దక్కింది. త్వరితగతిన పనులు పూర్తి చేస్తుందన్న పేరున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ పనులలో వడి చూపుతుంది. మొదటి టన్నెల్ 590 మీటర్లు, రెండవ టన్నెల్ ఇప్పటికి 7 కి.మీ తవ్వవలసి ఉంది. రెండవ టన్నెల్ పనులను 2023 ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలి. 2023 ఖరీఫ్ సీజన్లో నల్లమలసాగర్ 100% నిండాలి.
పోలవరం తరువాత ప్రాధాన్యతా ప్రాజెక్టుగా వెలిగొండను ముఖ్యమంత్రి జగన్ ప్రకటించి ఉన్నారు..మేఘా సంస్థ, అధికారులు నిర్దేశిత గడువులోపు వెలిగొండ పనులు 100% పూర్తి అయ్యేలా పనిచేయాలి… కరువు సీమగా, భూగర్భజలాలు అడుగంటిన మార్కాపురం డివిజన్,ఉదయగిరి ప్రాంతం సస్యశ్యామలం కావాలి