బీజేపీతో ఆ తల్లీకొడుకుల అనుబంధం ముగిసినట్లే కనిపిస్తోంది. దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ఇందిరాగాంధీ కుటుంబానికి చెందిన మేనకా గాంధీ, ఆమె తనయుడు వరుణ్ గాంధీ లను బీజేపీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపైనర్ల జాబితా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పింది. 30 మంది నేతలతో కూడిన ఈ జాబితాలో మేనకా, వరుణ్ ల పేర్లు లేకపోవడం యూపీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జాతీయ కార్యవర్గం నుంచి వీరిని తొలగించిన పార్టీ.. అత్యంత కీలకమైన, రాష్ట్రంలో అధికారం కాపాడుకోవాల్సిన అనివార్య పరిస్థితుల్లో తమ ప్రాంతాల్లో గట్టి పట్టున్న, ప్రముఖులైన ఇద్దరు నేతలను పూర్తిగా పక్కన పెట్టేయడం బీజేపీ కార్యకర్తలనే విస్మయపరిచింది.
రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపినందుకే..
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదిపాటు రైతులు నిర్వహించిన ఉద్యమానికి ఎంపీ వరుణ్ గాంధీ మొదటి నుంచి మద్దతుగా నిలిచారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా గళం విప్పిన ఏకైక బీజేపీ ఎంపీ ఆయనే. అక్టోబర్ మూడో తేదీన లఖిమ్ పూర్ ఖేరిలో ప్రదర్శన చేస్తున్న రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారుతో దూసుకుపోయి నలుగురు రైతుల మృతికి కారణమైన ఘటనకు సంబంధించిన వీడియోను వరుణ్ గాంధీయే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి కఠిన చర్యలకు డిమాండ్ చేశారు. ప్రధాన నిందితుడు ఆశిష్ ను అరెస్టు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని కూడా ఆరోపించారు. ఇక రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించగా.. ఉద్యమంలో సుమారు 700 మంది రైతులు మరణించారని, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తూ.. వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Also Read : కొడుకు కోసం…తల్లి పదవీ త్యాగం
ఈ పరిణామాల నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం నియమించిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో వరుణ్ తోపాటు అతని తల్లి, కేంద్ర మాజీమంత్రి మేనకా గాంధీకి కూడా చోటు లేకుండా చేశారు. అయినా వెనక్కి తగ్గని వరుణ్ గాంధీ కరోనా థర్డ్ వేవ్ ఆంక్షల విషయంలోనూ సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూ విధించడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించారు. పగటిపూట వేలాదిమందితో ఎన్నికల సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ.. రాత్రి కర్ఫ్యూ విధించడం వల్ల ప్రయోజనం ఏమిటని నిలదీశారు. వీటి పర్యవసానంగా ఏకంగా ఎన్నికల ప్రక్రియలోనే తల్లీకొడుకులకు ఎటువంటి ప్రమేయం లేకుండా బీజేపీ అగ్రనాయకత్వం చేసింది.
వారి అవసరం లేదా?
జనతాదళ్ తర్వాత బీజేపీలో చేరిన మేనకా గాంధీ ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో మోదీ తొలి ప్రభుత్వంలో మహిళా,శిశు సంక్షేమ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఆమె కుమారుడు వరుణ్ గాంధీ మూడోసారి ఎంపీ అయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో సహా పలు పదవులు నిర్వహించారు.
ప్రస్తుతం మేనకా సుల్తాన్ పూర్ కు, వరుణ్ ఫిలిబిత్ కు ఎంపీలుగా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో మంచి పట్టు ఉంది. పశ్చిమ యూపీలో ఉన్న ఆ రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో సిక్కు రైతుల జనాభా ఎక్కువ. రైతు ఉద్యమాల్లో వారే కీలకపాత్ర పోషించారు. వారికి అండగా నిలిచినందుకే వరుణ్, మేనకలు బీజేపీ నాయకత్వ ఆగ్రహానికి గురయ్యారు. ఎన్నికల్లో రైతులే అత్యధిక ప్రభావం చూపిస్తారు. వారిలో మంచి పట్టున్న వరుణ్, మేనకలను పార్టీ పట్టించుకోకుండా పక్కనపెట్టడం బీజేపీ శ్రేణులనే అసంతృప్తికి గురిచేస్తోంది.
Also Read : కమలదళంలోకి ములాయం చిన్న కోడలు