నిన్న హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడం నిర్మాత దిల్ రాజుకు మంచి జోష్ ఇచ్చింది. టాలీవుడ్ లో యుట్యూబ్లో ఇప్పటి దాకా ఏ లైవ్ ప్రోగ్రాంకు దక్కనంత స్ట్రీమింగ్ వ్యూస్ దీనికి రావడం పట్ల రాత్రే సోషల్ మీడియాలో అభిమానులు హంగామా చేశారు. వేదిక చిన్నది కావడంతో చాలా పరిమిత సంఖ్యలో పాసులు జారీ చేశారు. ఒకవేళ ముందు ప్లాన్ చేసుకున్న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ అయ్యి ఉంటే దీనికి నాలుగైదింతలు ఎక్కువ ఫ్యాన్స్ వచ్చేవాళ్లు. మిస్ చేసుకున్నారు కాబట్టే టీవీలో ఆన్ లైన్ లో చూసుకుని సంబరపడ్డారు. ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి.
అన్నింటి కన్నా బాగా హై లైట్ అయ్యింది మాత్రం బండ్ల గణేష్. ఊహించినట్టే పవన్ మీద తన విపరీతమైన భక్తిని ఓ రేంజ్ లో చాటుకున్నారు. దేవుడితో పోలుస్తూ కెజిఎఫ్ ని మించిన ఎలివేషన్లతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మాములు కిక్ ఇవ్వలేదు. ఇందులో కొంత అతిశయోక్తి ఉన్నప్పటికీ అందరికీ అలవాటైన వ్యవహారం కావడంతో ఎంజాయ్ చేశారు. పవన్ సైతం తన స్పీచ్ లో బండ్ల గణేష్ పేరుని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. ఇక దిల్ రాజు, వేణు శ్రీరామ్ లు పవన్ తో సినిమా చేయడం గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. అంజలి, అనన్య నాగళ్ళ కూడా హాజరయ్యారు. కరోనా కారణంగా నివేతా థామస్ రాలేదు.
ఇప్పుడీ వేడుక వల్ల వకీల్ సాబ్ కు కోరుకున్న హైప్ మరింత తోడైనట్టే. 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి షోలు మొదలుపెట్టేలా ప్లానింగ్ జరుగుతోంది. హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఒక్క జంట నగరాల్లోనే ఇప్పటికే మొదటి రోజుకు సంబందించి 90 శాతం టికెట్లు అమ్ముడుపోయి సుమారు కోటి రూపాయలకు దగ్గరలో గ్రాస్ ఉన్నట్టు సమాచారం. ఇది కొత్త రికార్డు. ఎంత పవన్ సినిమా అయినా ఓ రీమేక్ సినిమాకు ఈ స్థాయి క్రేజ్ రావడం విశేషమే. ఒకపక్క కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ ఇండస్ట్రీ చుట్టూ కమ్ముకుని ఉన్నా పరిస్థితి సీరియస్ గా లేదు కాబట్టి ఇది ఇలాగే కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారు