ఎన్నికలనగానే రాజకీయ లబ్ధి కోసం ప్రజలలో భావోద్వేగాలు కలిగించే సంచలన ప్రకటనలు చెయ్యటం బిజెపి నాయకులకు పరిపాటిగా మారింది. ఇక బిహార్ శాసనసభ ఎన్నికల వేళ పాకిస్తాన్,చైనా దేశాలతో యుద్ధానికి ప్రధాని మోడీ తేదీలు ఫిక్స్ చేశారని ఉత్తరప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ ఇంట్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ పాకిస్తాన్,మరియు చైనా దేశాలతో ఎప్పుడు యుద్ధం చేయాలో మోడీ ముందుగానే నిర్ణయించారని, యుద్ధం పట్ల ఆయన పూర్తి స్పష్టతతో ఉన్నారని యుద్ధం జరిగే తేదీలు కూడా ఖరారయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రామమందిరం, ఆర్టికల్ 370 రద్దు అంశాలపై ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నట్లుగానే పాకిస్థాన్, చైనాల యుద్ధంపై కూడా నిర్ణయం తీసుకున్నారని స్వతంత్రదేవ్ వెల్లడించారు. అంతే కాకుండా సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఉగ్రవాదులతో కలిసి పని చేస్తున్నట్లు స్వతంత్రదేవ్ ఆరోపించాడు.. ఈ వీడియోను బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర కలకలం చెలరేగింది.
ఇదిలా ఉంటే భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిక్కింలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత్ వీలైనంత త్వరగా సరిహద్దు ఉద్రిక్తతలకు స్వస్తి చెప్పి, శాంతిని స్థాపించాలని కోరుకుంటున్నట్లు ఆయన ప్రకటించాడు.అలాగే మన దేశానికి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వతంత్ర దేవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. గతంలో భారత్-చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలూ తమ సైన్యాలను భారీగా మోహరించాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.