ప్రభుత్వం సరైన దారిలో నడవాలంటే.. ప్రశ్నించే ప్రతిపక్షం ఎప్పుడూ ఉండాలి. కానీ రాజకీయాలు మారిపోయాయి. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంటున్నాయి అధికార పార్టీలు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. మొన్న బెంగాల్ లో.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఇదే పని చేస్తోంది బీజేపీ. ఇక అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒక అడుగు ముందుకేసి.. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చునే బదులు అధికార పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తెరవెనుక జరిగే ఫిరాయింపులను.. పబ్లిక్ గా ప్రస్తావించారాయన. పార్టీ ఫిరాయించడం తప్పు. కానీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి.. మీడియా ముందే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆఫర్ ఇవ్వడాన్ని ఏమనాలి??
కాంగ్రెస్ నుంచే వచ్చి..
2001 నుంచి 2015 దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు హిమంత బిశ్వ శర్మ. 2015 ఆగస్టులో బీజేపీలో చేరారు. మంత్రి అయ్యారు. నెల రోజుల కిందట జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి మ్యాజిక్ ఫిగర్ సాధించడంతో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మెజారిటీ తక్కువగా ఉండటంతో గతంలో తన సహచరులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్ నేత రూప్జ్యోతి కుర్మీని బీజేపీలోకి లాక్కున్నారు. కుర్మీ చేరిక సందర్భంగా మీడియా తో మాట్లాడిన శర్మ.. ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చుని ఏం చేస్తారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. కలిసి పని చేద్దామంటూ వారిని పిలిచారు. దీంతో మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
వాళ్లు రిసార్టులకు వెళ్లింది ఇందుకే..
మొన్న అసెంబ్లీ ఎన్నికలయ్యాక.. ఇంకా ఫలితాలు కూడా రాకముందే కాంగ్రెస్ తమ ఎమ్మెల్యే అభ్యర్థులను రిసార్టులకు తరలించింది. బీజేపీ ‘ఆపరేషన్ కమల్’ దెబ్బకు భయపడి అలా చేసింది. కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్నన్ని సీట్లు సాధించలేదు. కాంగ్రెస్ అప్పుడు భయపడ్డది.. ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల తర్వాత జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ లాగేసుకుంటోంది. తమ పార్టీలోకి ఫిరాయించండంటూ.. నేరుగా మీడియా ముందే చెబుతోంది. గతంలో కూడా మేఘాలయ, మణిపూర్, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఫిరాయింపులతో బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది.
ఏపీలో ఏడేళ్ల కిందట టీడీపీ
ఏడేళ్ల కిందట ఏపీలో టీడీపీ కూడా ఇదే పని చేసింది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరని కోట్లు పెట్టి కొనింది. కానీ గోడకు కొట్టిన బంతిలా స్వింగ్ అయింది వైఎస్సార్ సీపీ. చరిత్రలోనే నిలిచిపోయే విక్టరీతో ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకుంది. కానీ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని అనుకోలేదు. ‘‘నేను తలుచుకుంటే.. చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా చేసే వాడిని. ఫిరాయింపులను ప్రోత్సహించి ఉంటే.. టీడీపీలో ఎవరూ మిగిలేవారు కాదు’’ అని చెప్పి రాజకీయంగా తన హుందాతనాన్ని చాటుకున్నారు. చంద్రబాబు చేసిన తప్పును జగన్ చేయలేదు. ఫిరాయింపులను ప్రోత్సహించలేదు. విలువలతో కూడిన రాజకీయానికి చిరునామాగా నిలిచారు.
Also Read : యడ్యూరప్పను వెంటాడుతున్న గతం