నందిగ్రామ్‌లో ఎన్నికల ఫలితాలపై హైడ్రామా నెలకొంది. హోరాహోరీగా జరిగిన నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ 1200 ఓట్ల మెజారిటీతో గెలిచారని ప్రకటించారు. ఈ మేరకు అన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రచారం చేశాయి. అయితే మరికొద్దిసేపటికి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలిచినట్లు వార్తలొచ్చాయి.
సువేందు అధికారి 1622 ఓట్ల మెజారిటీతో గెలిచారంటూ వార్తలు వెలువడ్డాయి. అదే సమయంలో తాము 221 ఓట్ల మెజారిటీతో గెలిచామని టీఎంసీ శ్రేణలు చెబుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తోందని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. బీజేపీ, టీఎంసీ నేతల వాదనలు ఇలా ఉండగా.. మరో వైపు నందిగ్రామ్‌లో కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదని, కొనసాగుతోందని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో నందిగ్రామ్‌లో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది.
టీఎంసీలో ముఖ్యనేతగా, మంత్రిగా ఉన్న సువేందు అధికారి ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. దీంతో మమతాకు, సువేందుకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంతో తనపై పోటీ చేసి గెలవాలని సువేందు సవాల్ చేశారు. ఆ సవాల్‌ను స్వీకరించిన మమతా.. నందిగ్రామ్‌లో పోటీ చేశారు. ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగింది. పోలింగ్ రోజున మమతా అక్కడే తిష్ట వేశారు.
ఈ రోజు ఉదయం మొదలైన కౌటింగ్లో మమతా, సువేందు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. మొదట్లో సువేందు అధికారి ఆధిక్యంలో నిలవగా.. ఆ తర్వాత మమతా దూసుకొచ్చింది. మొత్తం 17 రౌండ్లలో లెక్కింపు జరిగింది. మొదటి ఐదు రౌండ్లలో సువేందు ఆధిపత్యం కనబర్చగా.. ఆ తర్వాత రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. చివరి రౌండ్ ముందు వరకు మమతా.. సువేందు కన్నా ఆరు ఓట్లు తక్కువ పోందారు. చివరిదైన 17వ రౌండ్ కీలకంగా మారింది. ఈ రౌండ్లో మమతా ఆధిక్యం కనబర్చారని, 1200 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారని ప్రకటించారు. అయితే మళ్లీ గంటలకే సువేందు గెలిచినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఈ పరిణామంపై మమత స్పందించారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఫలితం ఏదైనా.. నందిగ్రామ్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని ప్రకటించారు. ఈసీపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తానని ప్రకటించారు. సీఎంగా తానే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. ప్రమాణ స్వీకార తేదీని త్వరలో వెల్లడిస్తానని తెలిపారు.
Also Read : బెంగాల్ టైగర్ కు నందిగ్రామ్ సలాం