అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విగ్రహం తన ఇంటి ఆవరణలో ప్రతిష్టించి దానికి పూజలు చేస్తూ వచ్చిన వీరాభిమాని బుస్స కృష్ణ(31) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా సోకిన అనంతరం తీవ్ర మనోవేదనకు గురైన కృష్ణ ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్స కృష్ణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతోనే ట్రంప్ విగ్రహం తన ఇంటి ఆవరణలో ప్రతిష్టించి దానికి పూజలు నిర్వహిస్తూ ఉండేవాడు.అతనికి ఏడేళ్ల కుమారుడు ఉండగా, అతని భార్య కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందింది. అమెరికా అధ్యక్షుడు ఇండియాలో పర్యటించినపుడు ట్రంప్‌ను కలవాలని విఫలయత్నం చేసాడు.
కాగా ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ ఆరోగ్య విషయంలో మీడియా కథనాలను చూసి తీవ్ర మనోవేదనకు గురైనట్లు కృష్ణ తల్లిదండ్రులు వెల్లడించారు. ఆదివారం గుండెపోటు రావడంతో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దాంతో కుటుంబంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.