ఒకసారి బీజేపీ… మరోసారి కాంగ్రెస్ పార్టీకీ అధికారం ఇస్తూ వస్తున్న ఉత్తరాఖండ్‌లో ఈసారి జరిగే ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఉత్కంఠతను రేపుతోంది. కేవలం ఒకటిరెండు శాతం ఓట్లతో అధికారం తారుమారు కానున్నది. ఎన్నికల ప్రచార సరళి చూస్తున్నా… వివిధ సంస్థలు వెల్లడిస్తున్న సర్వే ఫలితాలు చూస్తున్నా ఇదే తేట తెల్లమవుతోంది. ఇటీవల జీ న్యూస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అనే పోరు నెలకొందని తేలింది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 40.1 శాతం ఓట్లు, బీజేపీకి 38.8 ఓట్లు వస్తాయని తేలింది. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్లు తేడా కేవలం 1.30 శాతం కావడం విశేషం. ఇదే సమయంలో ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న అమ్ ఆద్మీ పార్టీకి ఈసారి ఎన్నికల్లో ఏకంగా 12.5 శాతం ఓట్లు వస్తాయని తేలింది. బీజేపీకి ఎప్పటిలానే బ్రాహ్మణ్, ఠాకూర్, ఓబీసీల నుంచి ఎక్కువ శాతం ఓటింగ్ వస్తుండగా, కాంగ్రెస్ పార్టీకి ముస్లిం, దళిత ఓటు బ్యాంకు అండగా నిలబడనుంది.
బీజేపీకి బ్రాహ్మణుల్లో 57 శాతం, ఠాకూర్లలో 60, ఓబీసీలలో 67 శాతం మద్దతు ఉందని తేలింది. కాంగ్రెస్ పార్టీకి ముస్లిమ్లలో 84, దళితుల్లో 62 శాతం ఓటింగ్ పడే అవకాశముందని జీ న్యూస్ సర్వేలో తేల్చింది. ఇక ఉత్తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ఆయనకు ఏకంగా 43 శాతం మంది మద్దతుగా నిలవడం విశేషం. ఆ తరువాత ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమానికి 31 శాతం మంది, ఇదే పార్టీకి చెందిన అనీల్ బలూనీకి 11 శాతం, ఆప్‌కు చెందిన అజయ్ కొఠియాల్కు 7 శాతం మంది మద్దతు ఇస్తున్నారు. జీ ఒపీనియన్ పోల్ లో బీజేపీకి 31 నుంచి 35 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 33 నుంచి 37 స్థానాలు వస్తాయని తేల్చింది. ఆప్‌కు 2 స్థానాలు, ఇతరలకు ఒకస్థానం వచ్చే అవకాశముందని తేల్చింది.
ఏబీపీ- సీ ఓటరు సర్వే మాత్రం బీజేపీ తక్కువ ఓటింగ్ తేడాతో బీజేపీ అధికారంలోకి వస్తుందని తేల్చింది. ఈ సర్వే ప్రకారం బీజేపీకి 38.6 శాతం ఓట్లతో 31 నుంచి 37 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 37.2 శాతం ఓటింగ్‌తో 24 నుంచి 33 స్థానాలు వస్తాయని నిర్ధారించింది. ఈ సర్వేలో కూడా కేవలం 1.4 శాతం మాత్రమే ఓట్లు శాతం తేడాగా ఉండడం విశేషం. ఇదే సంస్థ గత ఏడాదిలో నిర్వహించిన సర్వేలు పరిశీలిస్తే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ ప్రాబల్యం తగ్గుతోందని తేలింది. గత ఏడాది అక్టోబరులో 44.6 శాతం ఓటింగ్ వస్తుందని ఈ సంస్థ తేల్చిచెప్పగా, నవంబరు నాటికి ఇది 41.4 శాతం, డిసెంబరులో 39.8 శాతానికి తగ్గింది. తాజాగా ఈ నెల నిర్వహించిన పోల్ లో 38.6 శాతానికి పడిపోయింది. గత ఏడాది అక్టోబరుతో పోల్చుకుంటే బీజేపీకి ఇక్కడే ఏకంగా 6 శాతం ఓట్లు తగ్గింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 5.9 శాతం ఓటింగ్ పెరగడం విశేషం.
Also Read : కమలం మరో మిత్రపక్షాన్ని కోల్పోతుందా?