బాహుబలి సాహ్గో తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాగా రాధే శ్యామ్ మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి దీని మీద వస్తున్న ఓటిటి పుకార్లకు మాత్రం అడ్డుకట్ట లేకుండా పోతోంది. నిన్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అయ్యింది. దాని ప్రకారం ఓ ప్రముఖ ఓటిటి సంస్థ రాధే శ్యామ్ ను గంపగుత్తగా 400 కోట్లకు డీల్ అడిగిందని, బడ్జెట్ 350 కోట్ల దగ్గరగా అయిన నేపథ్యంలో ఈ ప్రపోజల్ మీద నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. అభిమానులు దీని గురించి ట్విట్టర్, ఇన్స్ టా, ఫేస్ బుక్ లో గట్టిగానే చర్చించుకున్నారు.
ఇది నిజమా కాదా అనేది పక్కనపెడితే ఇవన్నీ వింటూ కూడా రాధే శ్యామ్ టీమ్ వీటిని ఖండిస్తూ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇదే తరహాలో టక్ జగదీశ్, విరాట పర్వం, ఎస్ఆర్ కల్యాణమండపం గురించి టాక్ వచ్చినప్పుడు ఆయా దర్శక నిర్మాతలు మేము థియేటర్లలోనే వస్తామని స్పష్టంగా స్టేట్ మెంట్లు ఇచ్చారు. ప్రభాస్ రేంజ్ హీరోకి ఇలాంటి వివరణలు అక్కర్లేదనుకున్నారో లేక సైలెంట్ గా ఉత్తమం అనుకున్నారో కారణం ఏమైనా ఏదో ఒక క్లారిటీ ఇస్తే బెటర్. ఇంకొంత భాగం మాత్రమే బాలన్స్ ఉన్న రాధే శ్యామ్ ని వాస్తవానికి దసరా లేదా దీపావళికి టార్గెట్ చేసినట్టుగా ఇన్ సైడ్ టాక్.
కాసేపు దీన్ని నిజమే అనుకుందాం. అసలు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ కు ఒక్క సినిమా మీద 400 కోట్ల రేంజ్ లో డబ్బులు వచ్చేంత సీన్ ఉందా అనేదే సామాన్యుల మదిలో మెదులుతున్న ప్రశ్న. నిజానికి వీటి రెవిన్యూ మోడల్ ఎవరికీ తెలియదు. పేరొందిన మీడియా సంస్థలకు సైతం ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్ లేక ఇంకేదైనా ఓటిటి సంస్థకు ఏ ప్రాతిపదికన లెక్కలు ఉంటాయనే స్పష్టత లేదు. శాటిలైట్ ఛానల్స్ తరహాలో వీటికి యాడ్ రెవిన్యూ కూడా ఉండదు. అలాంటిది వందల కోట్లను ఇవి కుమ్మరిస్తున్నాయంటే లోగుట్టు ఏదో ఉండే ఉంటుంది. మరి రాధే శ్యామ్ కు సంబంధించిన ఈ ప్రచారానికి చెక్ ఎలా పడుతుందో