కాలం మారింది.. కానీ లగ్నపత్రికల్లో తిథి, వారం, నక్షత, యోగ, కరణ నామాలకు నేటికీ ఆదరణ తగ్గలేదు. వేడుక ఏదైనా, పిలుపు ఏమైనా పత్రికలతోనే ఆహ్వానం పలకడం అనాదిగా వస్తున్న ఆచారమే. వివాహ ఆహ్వాన పత్రికలు ఆధునికంగా ఉన్నా ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’ అంటూ వధువును, ‘చిరంజీవి’ అంటూ వరుడిని సూచించే సంప్రదాయం నేటికీ మనుగడలోనే ఉంది. కృతయుతంలో మొదలైన ఆహ్వానపత్రికలు త్రేతాయుగం, ద్వాపరయుగం దాటి నేటి కలియుగంలోనూ ఆదరణను చూరగొంటూనే ఉన్నాయి. అది ఓ విధంగా సంతోష దాయకం.
పూర్వం అచ్చయంత్రాలు అందుబాటులో లేని కాలంలో..పురోహితుడు రాసిన లగ్నముహూత్ర కాగితాన్ని (లగ్నం కోటు) ఓ తెల్లని వస్త్రంలో కట్టి,దానికి పసుపు,కుంకుమలతో అలంకరించి.. పనిమనిషి చేతికిచ్చి బంధువుల ఇండ్లకు పంపి..ఫలానా తేది,ఫలానా ముహూర్తానికి పెళ్లి ముహూర్తం అంతా రండి అని ఆహ్వానంపంపేవారు.. ప్రింటింగ్ మిషన్స్ యుగం ప్రారంభమైన కొత్తలో..వివాహ ఆహ్వాన పత్రికలు..అరిటాకు, శివపార్వతులు లేదా శ్రీరాముడు శివదనుస్సు విరిచిన,ఆతర్వాత సీతారాముల కళ్యాణ ఘట్టం ఉన్న పత్రికలు అందుబాటులో ఉండేవి..కానీరాను రాను సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో చివరకు డిజిటల్ వివాహ ఆహ్వాన పత్రికలు దర్శనం ఇస్తున్నాయి
వివాహ ఆహ్వాన పత్రికల ముద్రణలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఆహ్వానపత్రాలు ముద్రించేవారు కూడా స్నేహితుల కోసం వేరేగా మరికొన్ని కార్డులు ముద్రించుకుంటున్నారు. రాజమండ్రికి చెందిన ఏడిద వెంకటేశ్ తన కుమార్తె అషిత వివాహం సందర్భంగా ఆధునిక శైలిలో ఏటిఎం కార్డు సైజులో ముద్రించిన ఈ పత్రిక అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సోదరుడు మెగా బ్రదర్ మరియు ప్రముఖ నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వివాహ మహోత్సల ఆహ్వాన పత్రిక
ను వెరైటిగా రూపొందించారు. ఒక బాక్స్ లాంటి దానిని డిజైన్ చేసి దానిని ఓపెన్ చేస్తే అందులో శుభ లేఖను ప్లాన్ చేశారు. అయితే ఈ బాక్స్ ను వెండి కోటింగ్ తో డిజైన్ చెయ్యడంతో సింపుల్ గానే ఉన్నా మరింత మందిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.
ఇక తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ శాంతినగర్‌కు చెందిన కల్వా భాగ్యలక్ష్మి, శివ ప్రసాద్ దంపతుల కుమారుడి వివాహం సందర్భంగా 108 పేజీల ఆహ్వాన పత్రికను ముద్రించారు. అందులో రైల్వే సమాచారం, ఆర్టీసీ బస్సుల వివరాలు, బ్యాంకులు, అంబులెన్స్, ప్రభుత్వాసుప్రతులు, హోటళ్లు, విద్యుత్తు కార్యాలయాలు, గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో ఉంది. ఇక ప్రకృతి ప్రేమికులైన యువ ఐఆర్ఎస్ అధికారి శశికాంత్ తన వివాహ ఆహ్వాన పత్రికను విత్తన పత్రిక రూపంలో తయారు చేసి ఆహ్వానితులకు అందజేయడం ఆశ్చర్యచకితులను చేశారు.
ఈ పత్రిక పేపర్ తో పాటు విత్తనాలు అందులోనే ఉండడం వల్ల మనకు మొక్కకు కావాల్సిన చోట వాటిని నాటి సంరక్షిస్తే ఆ విత్తనాలు మొలకెత్తి చెట్టుగా ఉద్భవిస్తాయి.ఇలా ఎవరి అభిరుచులకు అనుగుణంగా ముద్రించుకోవడం ఆనవాయితీగా మారింది. పూర్వం పరమ పవిత్రంగా భావించిన లగ్నపత్రిక రాను రాను స్టేటస్ సింబల్ గా మారింది.
మరోవైపు డిజిటల్ యుగంలో పెళ్లి కట్నాలు కూడా డిజిటలైజ్ అయిపోయాయి. తమిళనాడులోని మధురైలో ఓ కుటుంబం వెరైటీ పెళ్లి పత్రికను ప్రచురించింది. తమ కూతురి పెళ్లి కోసం .. వివాహ ముహూర్త ఆహ్వాన పత్రికపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. గూగుల్ పే, ఫోన్ పే క్యూఆర్ కోడ్లను ఆ పత్రిపై ప్రింట్ చేశారు. పెళ్లికి వచ్చిన అతిథులు కానీ.. మహమ్మారి వల్ల మ్యారేజీకి రానివారు కూడా ఇంటి నుంచే ఆ క్యూఆర్ కోడ్ల ద్వారా పెళ్లి కట్నాలను ఇచ్చుకునే అవకాశం కల్పించారు. కొత్త జంటకు కానుకలు ఇవ్వాలనుకున్న వారు.. గూగుల్ పే లేదా ఫోన్‌పే ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేసే వీలు కల్పించారు. అయితే పెళ్లికి వచ్చిన 30 మంది అతిథులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. వెడ్డింగ్ ప్రజెంట్‌గా నగదు ఇచ్చేందుకు క్యూఆర్ కోడ్లను వాడుకున్నారు. ఆదివారం ఈ పెళ్లి వేడుక జరిగింది. ఇంతలో ఆ పెళ్లి పత్రిక వైరల్‌గా మారింది.
మొత్తానికి వి వాహ ఆహ్వనం పూర్వకాలం నాటిదే.. ఆ సంప్రదాయాన్ని ఆచరిస్తూనే.. ప్రస్తుతం వాటి స్వరూపం మార్చుకుంది. కరోనా పుణ్యమా అంటూ అందరిని పిలువలేక..పిలిచినా నిబంధనలు అనుకూలించక పోవడంతో వాట్సాప్ లోనే ఆహ్వానాలుపంపి వాట్సాప్ లోనే దీవించే పరిస్థితి దాపురించింది,. మరి పోను పోను ఆహ్వాన పత్రికల స్వరూప స్వాభావాలు ఏ విధంగా మారుతాయో వేచి చూద్దాం!