సుధీర్ఘకాలం అంతఃకలహాలతో ఇబ్బంది పడిన పంజాబ్ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కుదుటపడి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. అయితే అభ్యర్థుల ఎంపిక వ్యవహారం పార్టీలో మళ్లీ చిచ్చు రేపింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ సోదరుడే టికెట్ ఇవ్వనందుకు నిరసనగా పార్టీపై తిరుగుబాటు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలోని 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చే నెల 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 86 మంది అభ్యర్థులతో అధికార కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తమ పేర్లు లేని పలువురు అసంతృప్తితో పార్టీపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.
ఫలించని సీఎం బుజ్జగింపులు
రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్ ఖరార్ సివిల్ ఆస్పత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో కొద్దిరోజుల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేసి సన్నాహాలు చేసుకుంటున్నారు. చన్నీ కుటుంబానికి పట్టున్న బస్సీ పఠాన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే ఒక కుటుంబం..ఒకే టికెట్ అన్న విధానం ప్రకారం పార్టీ అధిష్టానం మనోహర్ సింగ్‌కు టికెట్ నిరాకరించింది. సిటింగ్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్‌కు మళ్లీ అవకాశం ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మనోహర్ పార్టీపై తిరుగుబాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని పలువురు కౌన్సిలర్లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో మంతనాలు జరిపారు. అనంతరం తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. సోదరుడిని బుజ్జగించేందుకు సీఎం చన్నీ ప్రయత్నించినా ఆయన దిగిరాలేదు. పోటీకి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. సిటింగ్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్ అసమర్థుడని, అతని స్థానంలో పోటీ చేయమని స్థానికులు ఒత్తిడి చేస్తున్నారని.. వారి కోరిక మేరకే పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని మనోహర్ సింగ్ చెప్పారు.
మరికొన్ని నియోజకవర్గాల్లోనూ
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంతః కలహాలతో పార్టీ ప్రతిష్ట దిగజారినా ప్రధాన పార్టీలైన బీజేపీ,అకాలీదళ్‌ల నుంచి పెద్దగా పోటీ లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఎదుర్కోగలిగితే చాలు అధికారాన్ని కాపాడుకోవచ్చన్న ఆశాభావంతో ఉన్న కాంగ్రెస్‌కు టికెట్ల పంపిణీ వ్యవహారం కాస్త రచ్చకెక్కడం మింగుడు పడటం లేదు. సీఎం సోదరుడే కాకుండా మరికొందరు నేతలు, సిటింగ్ ఎమ్మెల్యేలు కూడా బయట పడుతున్నారు. వారం పది రోజుల క్రితమే పార్టీలో చేరిన సినీనటుడు సోనూసూద్ సోదరి మాళవిక కు మోగా సీటు కేటాయించి అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే హార్జోత్ కమల్‌ను పక్కన పెట్టారు. దాంతో ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీ తరఫున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మాన్సా, మలౌట్ తదితర నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ తిరుగుబాట్ల బెడద ఎదుర్కొంటోంది.