ఈటల రాజేందర్ ఏ క్షణాన టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారో.. అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో రోజుకో సంచలనం జరుగుతోంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన కొన్ని రోజులకే కౌశిక్ రెడ్డి ఆడియో వ్యవహారం దుమారం రేపింది. కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్లోకి కేసీఆర్ చేర్చుకుంటే.. డీఎస్ కొడుకు డి.సంజయ్, సామ వెంకట్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి లాక్కున్నారు రేవంత్ రెడ్డి. గతంలో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఎన్నికై.. తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని మొన్న రేవంత్ కలిశారు. కాంగ్రెస్‌లో చేరబోతున్నానని పరోక్షంగా చెప్పేశారు. అయితే ఇదంతా ఇలా ఉండగానే.. బుధవారం ఓ ఆసక్తికర ఘటన జరిగింది. గతంలో టీఆర్ఎస్లో ఉండి.. తర్వాత తమ దారి తాము చూసుకున్న ముగ్గురు నేతలు ఒకచోట కలిశారు. ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒకచోట కలవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
అరగంటపాటు చర్చ
ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరుతానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించినా.. ఇప్పటికైతే ఆయన ఏ పార్టీలో లేరు. ఈ నేపథ్యంలో బుధవారం ఈ ముగ్గురు నేతలు కలిశారు. పాదయాత్ర చేస్తున్న ఈటల రాజేందర్ వద్దకు వెళ్లిన జితేందర్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి.. సుమారు అర గంట పాటు కారులో చర్చలు జరిపారు. అయితే వాళ్లు ఏం మాట్లాడుకున్నారు? సడన్‌గా భేటీ జరగడానికి ఉన్న కారణమేంటనేది తెలియరాలేదు. కానీ ముగ్గురు మాజీ టీఆర్ఎస్ నేతలు రోడ్డుపైనే కారులో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. దీనిపై అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ స్పందించలేదు.
Also Read : ఈటల రాజేందర్ బలం కేసీఆర్ కు తెలుసా..?
కొండా దారి ఎటు?
ఈటల, జితేందర్ రెడ్డి కంటే ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారు. కాంగ్రెస్ నుంచి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 నుంచి 2019 దాకా మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డికి కేసీఆర్ రెండో సారి టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి బీజేపీలో చేరారు. ఇక ఈటల రాజేందర్.. కేసీఆర్ తో విభేదించి అవమానకర రీతిలో టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారు. ఆయన పార్టీ పెడుతారని అంతా భావించినా.. చివరికి బీజేపీ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నేతలు కావడం చర్చనీయాంశమవుతోంది. ముందు నుంచీ ఈటలకు అనుకూలంగానే కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయనపై భూకబ్జా ఆరోపణలు వచ్చినప్పుడూ మద్దతుగా మాట్లాడారు. కానీ ఈటలతోపాటు బీజేపీలో చేరలేదు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉందని చెబుతున్న విశ్వేశ్వర్ రెడ్డి.. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరుతానని రేవంత్‌తో చెప్పి కూడా వారం పదిరోజులు కావస్తోంది. అయినా ఆ విషయంలో క్లారిటీ లేదు.
ఈటలకు మద్దతు కరువు?
ఇక ఈటల రాజేందర్ పరిస్థితీ అంత మెరుగ్గా ఏం లేదు. బీజేపీలో చేరిన చాలా రోజుల దాకా కనీసం అమిత్ షాను కలిసేందుకు అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం మీద ఆశలు వదులుకున్న ఆయన.. సొంతంగానే తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. పార్టీలో ఆయనకు పెద్దగా మద్దతు దక్కడం లేదనే వాదనలు ఉన్నాయి. స్థానిక నేత పెద్దిరెడ్డి ముందు నుంచీ ఈటల చేరికను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఈటల భార్య జమున మాటలను బట్టి చూస్తే.. టికెట్ ఎవరికి ఇస్తారనేదీ క్లారిటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు నేతలు భవిష్యత్ రాజకీయాలపై చర్చించారా? అనే దానిపై అప్పుడే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్నిరోజులు ఆగితే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read : హుజూరాబాద్ లో ఈటల జమున పోటీ చేయాలనుకుంటున్నారా..?