ఇటీవలే పుష్ప సినిమాలో తన పాత్ర పరిచయం వీడియో లాంచ్ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ట్యాగ్ ని ఐకాన్ స్టార్ గా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మార్పు ఎందుకనే విషయం ఎవరికీ అర్థం కాలేదు కానీ పోను పోను ఇదే అలవాటవుతుంది లెమ్మని అభిమానులు సర్దిచెప్పుకున్నారు. ఇదిలా ఉండగా ఇంతకీ దిల్ రాజు నిర్మించబోయే ఐకాన్ సినిమాని బన్నీనే చేస్తాడా లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కారణం ఇటీవలే జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత ఈ ప్రాజెక్ట్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలోనే ఉంటుందని చెప్పారు కానీ ఖచ్చితంగా బన్నీనే హీరో అని నొక్కి వక్కాణించలేదు. అడిగితే అది హీరో చేతుల్లో ఉందని స్మార్ట్ గా తప్పుకున్నారు.
ఎప్పుడో ఏడాది క్రితం అనౌన్స్ చేసి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న ఐకాన్ అల వైకుంఠపురములో ఫలితం వచ్చాక స్లో అయ్యింది. అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్లను ఎంచుకుని మరీ ప్రాజెక్టులను సెట్ చేసుకున్నాడు.సుకుమార్ తో పుష్ప చేశాక నెక్స్ట్ ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లను టార్గెట్ చేశాడు. కొరటాల శివతో కూడా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రొడక్షన్ హౌస్ చెప్పింది కానీ అది కార్యరూపం దాల్చే దాకా నమ్మలేం. అప్పటిదాకా ఇది ప్రకటనకే పరిమితం. పుష్ప తర్వాత చేయబోయే సినిమా గురించి ఏ చిన్న క్లూ కూడా వదలకుండా అల్లు టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఏ లీకు రాలేదు.
వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ తో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ అది రీమేక్ కావడంతో పాటు పవన్ కం బ్యాక్ ఇమేజ్ దన్నుగా నిలవడంతో ఆ స్థాయి కలెక్షన్లు సాధ్యమయ్యాయి. ఫ్లాష్ బ్యాక్, ఫస్ట్ హాఫ్ నెరేషన్ లో చేసిన పొరపాట్లను గుర్తించిన వారు లేకపోలేదు. కేవలం వకీల్ సాబ్ తోనే వేణుని టాప్ కమర్షియల్ డైరెక్టర్ గా పరిగణించడం కష్టం. ఈ అభిప్రాయంతోనే బన్నీ ఐకాన్ గురించి కాస్త తడబడుతూ ఉండొచ్చని అంటున్నారు. ఒకవేళ తను చేయకపోయినా వేరే హీరోతో తీస్తే మాత్రం ట్యాగ్ పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. సో ఐకాన్ కన్ఫ్యూజన్ తీరాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు