ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో రేపటి నుంచి థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కాకపోవడం ముందే డిసైడ్ అయ్యింది కానీ ఇప్పుడు కుదిపేస్తున్న వర్షాలతో మిణుకుమిణుకుమంటున్న ఆశలు కూడా పూర్తిగా ఆవిరయ్యాయి. అయితే బాలీవుడ్ లో మాత్రం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు. రేపటి నుంచి మల్టీ ప్లెక్సులతో పాటు సిద్ధంగా ఉన్న యాజమాన్యాల సింగల్ స్క్రీన్లను కూడా తెరవబోతున్నారు. ఈ మేరకు సీటింగ్ మార్పులతో ఆయా యాప్స్ లో ఆన్ లైన్ బుకింగ్ లో టికెట్ లు ఇవ్వడం కూడా మొదలైపోయింది. ముందు నుంచి ఊహిస్తున్నట్టుగానే ప్రస్తుతానికి పాత సినిమాలతోనే కొన్ని రోజులు నెట్టుకురాబోతున్నారు.
తానాజీ, శుభ మంగళ్ జ్యాదా సావధాన్, భాగీ 3 లాంటి లాక్ డౌన్ ముందు వరకు ప్రదర్శించినవి వేయబోతున్నారు. ఓటిటి లో నేరుగా వచ్చేసిన గులాబో సీతాబో, సడక్ 2, ఖుదా హఫీజ్, లూట్ కేస్, యారా తదితరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్క్రీనింగ్ చేసే సమస్యే లేదని మల్టీ ప్లెక్సులు ఇప్పటికే చెప్పేశాయి. సో ఆ ఛాన్స్ లేనట్టే. రేపు థియేటర్లు తీరబోతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, మణిపూర్, బీహార్, గోవా, చత్తిస్ గడ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, పుదుచ్చేరి ఉన్నాయి. సినిమా హాళ్లు తెరిచే అవకాశం లేని స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒరిస్సా, కేరళ, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, అస్సామ్, త్రిపుర, మేఘాలయ, మిజోరమ్ లు ఉన్నాయి.
వీటిలో చాలా మటుకు ఆయా ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగించడం వల్ల వచ్చిన పరిస్థితి. ఆంధ్ర గవర్నమెంట్ సానుకూలంగానే ఉన్నట్టు కనిపిస్తున్నా స్థానిక డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కంటెంట్ లేని కారణంగా తీసేందుకు సుముఖంగా లేరు. మొత్తంగా చూసుకుంటే దేశం మొత్తం సగం థియేటర్లు తెరుచుకుని సగం యధాస్థితిని కొనసాగించబోతున్నాయి. ఏదో ఒక ముందడుగు పడాల్సిందే కాబట్టి ఇది ఆహ్వానించాల్సిన పరిణామమే. సీటుకు సీటుకు మధ్య గ్యాప్ తప్పనిసరిగా ఉంచాల్సిన సరికొత్త వాతావరణంలో రేపటి నుంచి ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. నవంబర్ రెండు లేదా మూడో వారం అంటే దీపావళి వచ్చేదాకా కొత్త రిలీజులు ఉండే అవకాశాలు దాదాపుగా లేవు. నిర్మాతలు కూడా వేచి చూసే ధోరణినే కొనసాగిస్తున్నారు.