కరోనా నివారణాచర్యల్లో భాగంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో పిహెచ్సి స్థాయిలోనే కరోనా టెస్టింగ్, శాంపిళ్ల సేకరణ ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నివారణలో భాగంగా రాష్ట్రంలో ఆస్పత్రులను సిద్ధం చేయడంతోపాటు సరిపడా వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని నియమించుకోవడం కీలకమని, వైద్య సిబ్బందికి కొరత లేకుండా ఖాళీలను గుర్తించి, అన్నింటినీ వెంటనే భర్తీచేయాలని ఆదేశించారు.
కరోనా వచ్చిందని అనుమానం వస్తే ఎవరికి రిపోర్ట్ చేయాలి ? పరీక్షలకు ఎక్కడకు వెళ్లాలి ? ఐసోలేషన్ ఎలా పాటించాలి ?అంశాలపై క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన డోర్లెవల్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ తయారు చేయాలని ఆదేశించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, పరీక్షలు చేయించుకునేలా ఈ విధానం ఉండాలన్నారు. 104 వాహనం, అంబులెన్స్, 14410-టెలిమెడిసిన్ లేదా ప్రజాసమస్యల కోసం ఉద్దేశించిన 1902 లాంటి నంబర్లకు ఫోన్‌చేసినా వెంటనే సంబంధిత వ్యక్తికి పరీక్షలు చేయడం, వైద్యం అందించడం వంటి ప్రక్రియలు సాఫీగా సాగేలా యంత్రాంగాన్ని నిర్మించాలని ఆదేశించారు. ఈ మేరకు విస్తృత ప్రచారం ద్వారా అవగాహన కల్పించాలన్నారు.
వైరస్ రావడమన్నది నేరం కాదని, వారి పట్ల వివక్ష చూపడం సరికాదని అన్నారు. దీర్ఘకాలంలో కరోనా పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. చిట్టచివరి స్థాయిలో ఏర్పాటు చేయదలుచుకున్న విలేజ్ క్లీనిక్స్ ఇలాంటి మహమ్మారులను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. పిహెచ్‌సిల్లో వైద్యుల సంఖ్యను పెంచడం, వారికి వైఎస్ఆర్ విలేజ్ క్లీనిక్స్‌ను కేటాయించడం వరకూ వెళ్లాల్సి ఉంటుందన్నారు. సూచించిన మూడు జిల్లాల్లో పిహెచ్సిల స్థాయిలోనే టెస్టింగ్ శాంపిళ్ల సేకరణ సదుపాయాలను ఏర్పాటు చేస్తామని, దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేస్తామని అధికారులు సిఎంకు వెల్లడించారు.
అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం, జిల్లాల్లోని కరోనా ఆస్పత్రుల్లో ఇప్పుడున్న పడకల సంఖ్యను, ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను పెంచనున్నట్లు వివరించారు. విమానాల రాకపోకలు ప్రారంభవుతున్నందున, ప్రయాణికులనుంచి శాంపిల్ తీసుకుని, వారిని హోం క్వారంటైన్ సూచిస్తామని తెలిపారు. కనీస జాగ్రత్తలు పాటించేలా తగిన సూచనలు చేసి పాటించేలా చూస్తామన్నారు.