కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో మళ్ళీ స్కూళ్లను ప్రారంభించే విషయమై విద్యార్థుల తలిదండ్రుల నుంచి ఫీడ్ బ్యాక్ కోరవలసిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు మానవ వనరుల శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది. అసలు తిరిగి ఎప్పుడు బడులు, ఇతర విద్యాసంస్థలు ప్రారంభించాలి.. పేరెంట్స్ ఏమనుకుంటున్నారు.. వారి అభిప్రాయాలేమిటి తదితర వివరాలతో ఫీడ్ బ్యాక్ ని పంపాలని కేంద్రం నుంచి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖ కార్యదర్శులకు సర్క్యులర్ అందింది.
స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ విభాగం జారీ చేసిన ఈ సర్క్యులర్ మేరకు విద్యాశాఖ కార్యదర్శులు ఫీడ్ బ్యాక్ రూపొందించారు. విద్యా సంస్థలను ఆగస్టు మాసంలో లేదా సెప్టెంబరులో లేక అక్టోబరులో తెరవాలా… తెరిస్తే కలిగే పరిణామాలపై పేరెంట్స్ నుంచి వారి స్పందన ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కేంద్రం తెలుసుకోగోరుతోంది. కాగా.. ఈ తేదీకి సంబంధించి డెడ్ లైన్ ని కేంద్రం పొడిగించే సూచనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆగస్టులో స్కూళ్ల ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకోవచ్చని జూన్ లో కేంద్రం తెలిపింది. జూలై నెలలో అంచనాలకు మించి కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో పాఠశాలల ప్రారంభంపై కేంద్రం మరోసారి పునరాలోచనలో పడింది. అయితే.. ఈ సారి తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు పేర్కొంది.
వచ్చే నెలలో స్కూళ్ల ప్రారంభానికి తెలుగు రాష్ట్రాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక నుంచి.. మొదలు పెట్టాలా.. ప్రాథమికోన్నత నుంచి మొదలు పెట్టాలా అని చర్చిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం సర్క్యులర్ నేపధ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ పరిస్థితుల్లో చదువుల కన్నా.. పిల్లల ఆరోగ్యానికే తల్లిదండ్రులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపితే కేసుల సంఖ్య దాదాపు లక్ష దాటేసింది. ఈ క్రమంలో పాఠశాల ప్రారంభానికి తల్లిదండ్రులు ఒప్పుకోక పోవచ్చు. ఎక్కువ మంది ఆన్ లైన్ క్లాసులకు మొగ్గు చూపుతున్నారు.