ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాని లేదా క్లాసిక్ ని ఎప్పుడూ గుడ్డిగా రీమేక్ చేయకూడదు. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అందులో కథాకథనాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎంచుకున్న నటీనటులు ఒరిజినల్ వెర్షన్ స్థాయిలో న్యాయం చేయగలరో లేదో సరిచూసుకోవాలి. అంతే తప్ప అక్కడ హిట్టు కొట్టింది కదా ఇక్కడా జనం ఎగబడి చూస్తారని భ్రమపడితే పరాభవం తప్పదని ప్రేక్షకులు ఎన్నోసార్లు ఋజువు చేశారు, చేస్తూనే ఉన్నారు. కొన్ని సార్లు ఇలాంటి ప్రయత్నాలు బెడిసి కొట్టి నవ్వులపాలు కూడా అవుతాయి. దాని వల్ల దర్శకుడికి హీరోకి కూడా ఇమేజ్ పరంగా డ్యామేజ్ జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మచ్చుకు ఒకటి చూద్దాం.
1993 సంవత్సరం. వెర్సటైల్ ఫిలిం మేకర్ గా భారీ చిత్రాలకు ప్రసిద్ధి గాంచిన సుభాష్ ఘాయ్ సంజయ్ దత్ టైటిల్ రోల్ లో నిర్మించి దర్శకత్వం వహించిన ‘ఖల్ నాయక్’ బాలీవుడ్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఏడాది భారీ వసూళ్లు సాధించిన బ్లాక్ బస్టర్స్ లో రెండో ప్లేస్ లో నిలిచింది. విలన్ ని హీరోగా చూపించి మూడుగంటల పాటు కనికట్టు చేసిన సుభాష్ ఘాయ్ టేకింగ్ కి అందరూ సాహో అన్నారు. ముఖ్యంగా మాధురి దీక్షిత్ గ్లామర్ దీన్ని ఎక్కడికో తీసుకెళ్లింది. ఎక్కడ విన్నా చోళీ కే పీచే క్యా హై పాట యావత్ దేశాన్ని ఉర్రూతలూపింది. అందులో అర్థం తొలుత వివాదాన్ని రేపినా ఆడియో క్యాసెట్ల అమ్మకాలను అమాంతం పెంచేసింది.
ఒక దుర్మార్గుడి బయోపిక్ గా సాగే ఖల్ నాయక్ లో సంజయ్ దత్ క్యారెక్టరైజేషన్ ఇప్పటికీ ఒక గ్రామర్ బుక్ లాంటిది. అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ ఖల్ నాయక్ ఓ రేంజ్ లో ఆడింది. దీన్ని తెలుగులో ‘ఖైదీ నెంబర్ 1’ పేరుతో ఏ జగన్నాథం దర్శకత్వంలో రీమేక్ చేశారు.1994 సెప్టెంబర్ 9న విడుదలయ్యింది. హీరోగా వినోద్ కుమార్ చేయగా హిందీలో జాకీ శ్రోఫ్ చేసిన కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రను రఘు(ఇప్పటి రెహమాన్) పోషించారు. ఇక మాధురి దీక్షిత్ చేసిన గంగ రోల్ ని సుకన్య(పెద్దరికం ఫేమ్)కు ఇచ్చారు. క్యాస్టింగ్ దగ్గరే తేడా కొట్టిన ఖైదీ నెంబర్ 1 బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. సాఫ్ట్ ఫామిలీ సినిమాల్లో చూసి అలవాటు పడిన వినోద్ కుమార్ ని ఖల్ నాయక్ గా ప్రేక్షకులు చూడలేకపోయారు. నాసిరకం మేకింగ్ దెబ్బతీసింది. కీరవాణి సంగీతం కూడా తేలిపోయింది.