సరిగ్గా 18 ఏళ్ళ క్రితం 2003లో విడుదలైన శంకర్ బాయ్స్ అప్పటి యూత్ ని ఎంతగా ఉర్రూతలూగించిందో అందరికీ గుర్తే. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ పాటలు మారుమ్రోగిపోయాయి. కమర్షియల్ గా రికార్డులు సృష్టించకపోయినా తెలుగు వెర్షన్ మాత్రం ఇక్కడ గట్టిగానే ఆడింది. హీరో సిద్ధార్థ్ స్నేహితుల బ్యాచ్ లో ఒకరిగా ఇప్పటి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ నటించడం ఆ సినిమా చూసినవారెవరూ మర్చిపోలేరు. అందులో కృష్ణ పాత్రలో థమన్ నటన బాగా క్లిక్ అయ్యింది. డ్రమ్స్ వాయిస్తూ కనిపించే ఆ కుర్రాడు ఇంకో దశాబ్దం తర్వాత సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని ఎవరైనా ఊహించి ఉంటారా.
ఇప్పుడు శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాకు థమనే సంగీత దర్శకుడిగా ఎంపిక కావడం ప్రత్యేక విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఏఆర్ రెహమాన్, హరీష్ జైరాజ్ తప్ప ఇంకో ఆప్షన్ పెట్టుకోకుండా పాతిక సంవత్సరాలు సినిమాలు చేస్తూ వచ్చిన శంకర్ మొదటిసారి థమన్ కు ఎస్ చెప్పడం గొప్ప మలుపనే చెప్పుకోవాలి. ఒక్క మాట మాత్రం నిజం. రెహమాన్ ఒకప్పుడు వెర్రెక్కిపోయే సంగీతం ఇచ్చాడు కానీ ఇప్పుడాయన ఫామ్ లో లేరు. చాలా టిపికల్ స్టైల్ లో ట్యూన్స్ ఇస్తున్నారు. అవి అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ కావడం లేదు. అందుకే థమన్ సెలక్షన్ కరెక్ట్ అనే చెప్పాలి.
రామ్ చరణ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్, ఆచార్యలు ఇంకా పూర్తి కానప్పటికీ ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. ఇటీవలే సంభాషణల కోసం సాయి మాధవ్ బుర్రని, డాన్స్ కోసం జానీ మాస్టర్ ని ఎంపిక చేసుకుని ఆ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోయే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేయొచ్చనే టాక్ ఇప్పటికే ప్రచారం లో ఉంది. వయసు మళ్ళిన క్యారెక్టర్ ఒకటి, యువకుడిగా మరొకటి రెండు కీలక పాత్రలు ఉంటాయట. అయితే లుక్ టెస్ట్ చేశాకే శంకర్ నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. త్వరలోనే టైటిల్ కూడా ప్రకటిస్తారని వినికిడి