దుబ్బాక ఉప ఎన్నిక జరిగిన తీరు అందరికీ తెలిసిందే. వార్ వన్ సైడే నుంచి.. టగ్ ఆఫ్ వార్ గా మారింది. అధికార పక్షం టీఆర్ఎస్.. తెలంగాణలో అధికారం చేజిక్కోవాలన్న కోరికతో బీజేపీ.. ఉప ఎన్నిక ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా పోరాడాయి. నాడు టీఆర్ఎస్ లో ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలో చేర్పించుకోవడమే కాకుండా అతనికే టికెట్ ఇచ్చి కాంగ్రెస్ కూడా అనూహ్య రాజకీయాలకు తెర తీసింది. దీంతో నువ్వా – నేనా అంటూ సాగిన దుబ్బాక రేసులో టీఆర్ఎస్ – బీజేపీ మధ్యే తీవ్ర పోటీ నడిచినట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా.. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికలో ఎదురైన పోటీని దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి భారతీయ జనతాపార్టీని ఆత్మరక్షణలోకి నెట్టి, ముందుగా తానే అడుగు ముందుకు వేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ కూడా దీటుగా బదులిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
వరదలే ఆయుధంగా…
అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు పార్టీలూ ఇటీవల హైదరాబాద్ ను ముంచెత్తిన వరదలనే ఆయుధంగా మలుచుకుంటున్నాయి. వరదల వంటి విపత్కర పరిస్థితులు వస్తే గుజరాత్, కర్ణాటక లాంటి భాజపా పాలిత ప్రాంతాలకు వందల కోట్లు నిధులు ఇచ్చిన కేంద్రం హైదరాబాద్ కు మొండి చేయి చూపిందంటూ మంత్రి కేటిఆర్ నేరుగా విమర్శలు కురిపిస్తున్నారు. నగరానికి కేంద్రం ఎంతో సాయం చేస్తోందని, దాన్ని టీఆర్ఎస్ నేతలు చెప్పడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలు, ప్రత్యారోపణలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. హైదరాబాద్ కు కేంద్రం ఎటువంటి వరదసాయం అందించలేదన్నది బహిరంగ రహస్యం. భాజపా నాయకులు కూడా మాట్లాడలేని బలహీనత అదే. కేటిఆర్ అక్కడే దెబ్బ కొట్టి, ఆ పార్టీ నేతలను ఆత్మ రక్షణలో పడేసారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కు కేంద్రం రెండు వందల కోట్లకు పైగా సాయం అందించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా చేసిన ప్రకటనపై కేటీఆర్ ఆయనను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. దుబ్బాక పోలింగ్ అనంతరం టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడే ఇలా ఉంటే.. రణం ప్రారంభమైతే రాజకీయ కాక ఇంకెలా ఉంటుందో వేచి చూడాలి.