టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో జరగనున్న ఉప ఎన్నికలో దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీకి అన్ని పార్టీలూ సై అంటున్నాయి. కార్యకర్తలు సమాయత్తం కావాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిలుపు నివ్వగా.. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా భావిస్తున్న బీజేపీ కూడా పోటీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇది టీపీసీసీ నిర్ణయమని, దీనికి వ్యరేకంగా ఎవరూ మాట్లాడినా అది వారి వ్యక్తిగతమని తెలిపారు. మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం సిద్దం చేయాలని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి సూచించారు. దీంతో అభ్యర్థి ఎవరనేదానిపై పార్టీలో చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన నాగేశ్వర్ రెడ్డి అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిది కోమటిరెడ్డి నర్సింహారెడ్డి నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఉప ఎన్నికలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు అనుచరుల వద్ద చెబుతున్నారు. టీజేఎస్ నేత భవానీ తాజాగా కాంగ్రెస్ లో చేరింది. ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ కూడా సిద్ధం
పార్టీని, కేడర్ ను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా దుబ్బాకలో పోటీ సిద్ధమవుతున్నట్లు తెలస్తోంది. పంచాయతీవార్డు నుంచి లోక్ సభ వరకూ ఏ ఎన్నిక జరిగినా పోటీ చేయాల్సిందేనని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాష్ట్ర నాయకత్వానికి పలుమార్లు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు 14 శాతం ఓట్లు అంటే సుమారు 23 వేల ఓట్లు సాధించారు. అలాగే లోక్ సభ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి 30 వేల ఓట్లు పడ్డాయి. ఈ సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ పోటీలో దిగి విజయం సాధించేందుకు పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.
రామలింగారెడ్డి కుటుంబానికే…
టీఆర్ఎస్ మాత్రం దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకే దుబ్బాక టికెట్ ఇచ్చే ఆలోచనలో ఇన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే స్థానికంగా రామలింగారెడ్డి కి ఉన్న పేరుకు తోడు సానుభూతి తో ఆ పార్టీ అభ్యర్థే విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఏకగ్రీవానికి సహకరిస్తామని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు కూడా. జగ్గారెడ్డి ప్రకటనపై కొందరు బీజేపీ నేతలు కూడా చర్చించినట్లు తెలిసింది. మొత్తమ్మీద దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి అన్ని పార్టీలూ అక్కడ పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన తర్వాత సమీకరణాలు ఎలా మారతాయో వేచి చూడాలి.