అక్రమాలకు పాల్పడిన తెలుగుదేశం నేతలు ఇప్పటికే చాలా మందిని ఏపీలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారు తప్పు చేసినప్పటికీ.. అరెస్ట్ చేయడం సరికాదన్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి నేతలందరూ ఇది ప్రభుత్వ కుట్ర అంటూ ప్రకటనలు మొదలెట్టేవారు. హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినా అదే తంతు.. అవినీతిపరులను అరెస్ట్ చేసినా అదే తంతు. తప్పు చేసిన తెలుగుదేశం నేతలను అరెస్టు చేయడమే తప్పు అన్నట్లుగా టీడీపీ అండ్ కో పెద్ద ఎత్తున దుమారం రేపేది. ఇప్పుడు అదే పార్టీకి చెందిన భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇక్కడ అరెస్ట్ చేసింది తెలంగాణ పోలీసులు. వివాదాలు ఉన్నది కూడా అక్కడే. బోయన్‌పల్లిలో నిన్న రాత్రి మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్ రావును ఆయన సోదరుల్ని కిడ్నాప్ చేసినకేసులో భూమా అఖిల ప్రియను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఇప్పటి వరకూ టీడీపీ నేతలు ఎవ్వరూ నోరు మెదపకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కేసు తీవ్రత కారణమా..? జరిగింది తెలంగాణలో కావడమా..? అనేది అర్థం కావడం లేదు.
ఏ1 గా ఆళ్లగడ్డ టీడీపీ నేత
ఈ కేసులో ఏ1 గా ఆరోపణలు ఎందుర్కొంటున్న ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని కూడా మాదాపూర్‌లోని అతని నివాసంలో హైదరాబాద్ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. తాజా అరెస్టుతో ప్రవీణ్‌రావు కిడ్నాప్ కేసులో అరెస్టయినవారి సంఖ్య మూడుకు చేరింది. ఏ2 అఖిలప్రియ, భార్గవ్‌రామ్ సోదరుడు చంద్రబోసును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏ3గా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ పరారీలో ఉన్నాడు. బోయిన పల్లిలో సినీ ఫక్కీలో ఈ కిడ్నాప్ జరిగింది. మంగళవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రవీణ్ రావు ముగ్గురు సోదరుల కిడ్నాప్‌కు గురయ్యారు.
ఐటీ అధికారుల పేరుతో సోదాలు, అరెస్ట్ పేరుతో కిడ్నాపర్లు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్నవారిని ఓ గదిలో బంధించారు. ముగ్గుర్ని కూడా కారుల్లో ఎక్కించి తీసుకెళ్లారు. అయితే ఫిర్యాదు అందిన ఆరుగంటల్లో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరా ఆధారంగా నిందితులను గుర్తించారు. నేరుగా రంగంలోకి హైదరాబాద్ సిపి అంజనీకుమార్ దిగారు. నగర శివార్లు దాటకముందే కిడ్నాపర్స్ ఎవరో గుర్తించారు. పోలీసుల అదుపులో 15మంది నిందితులు ఉన్నారు. కిడ్నాపర్లు ఉపయోగించిన మూడు వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తీసుకెళ్లిన ఫోన్స్, హార్డిస్క్, డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. హఫీజ్ పేట్ 50ఎకరాల భూ వివాదమే కిడ్నాప్ కారణం అని పోలీసులు తేల్చారు. అయితే ఈ భూ వివాదంలో చాల మంది ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ్ సోదరుడు చంద్రబోస్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు . ఈ క్రమంలోనే కూకట్పల్లి పోలీసులు అఖిలప్రియను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లా రాజకీయంలో ఒక వెలుగు వెలిగిన కుటుంబం భూమా ఫ్యామిలీ. పార్టీలు ఏవైనా తమ ప్రతిష్టను నిలుపుకున్నారు. అటు ఎస్వీ కుటుంబం, ఇటు భూమా కుటుంబం రాజకీయంగా దశాబ్దాలుగా తమ ఉనికిని చాటుకుంటూ వచ్చింది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల హయాంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా ఎక్కడా భూమా ప్రభ తగ్గలేదు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా చాకచక్యంగా వ్యవహారాలను నడిపించుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. ఒకే స్థాయి విలువను పొందారు. భూమా శోభా నాగిరెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబ రాజకీయాల్లో తప్పటడుగులు మొదలయ్యాయి. అది ఇప్పుడు అఖిల ప్రియ అరెస్ట్ వరకూ వచ్చింది. ఈ అరెస్టు ఏ ఏపీలోనో జరిగి ఉంటే.. రాజకీయ కక్ష సాధింపు అంటూ సులువుగా తీసి పడేసేవారు. అయితే కిడ్నాపింగ్ వ్యవహారం కావడం, అఖిలప్రియ భర్త పరారీలో ఉండటం, అఖిలను నిందితురాలిగా తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి మహిళా పోలిస్ స్టేషన్ కు తరలించడం… వ్యవహారం తీవ్రతను తెలియజేస్తూ ఉంది. దీంతో ఇప్పటి వరకూ ఈ అరెస్ట్ పై టీడీపీ నాయకులెవ్వరూ ముందుకు రాలేదు.