దీపావళి పండుగ నేపథ్యంలో ఢిల్లీ, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్ లతో పాటు పలురాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టపాసులను నిషేధించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే దీపావళికి తెలంగాణ వ్యాప్తంగా టపాసులు పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది ఇంద్ర ప్రకాష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా ఉన్నాయని, ఈ సమయంలో టపాసులు పేల్చడం వలన ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని, వీటి వలన ప్రజలు శ్వాస కోశ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు.
ఇంద్రప్రకాశ్ వేసిన పిల్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో బాణసంచా వినియోగం మరియు అమ్మకాలపై నిషేధం విధిస్తూ రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. బాణసంచా నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.