దేశ వ్యాప్తంగానే కాక తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ కూడా విధించారు కానీ రాష్ట్రమంతా పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతి తర్వాత అమలు చేయాలని నిర్ణయించారు.
తెలంగాణలో ప్రస్తుతానికి ఎలాంటి ఆంక్షలు విధించలేదు కానీ తగిన కట్టడి చర్యలు మాత్రం తీసుకుంటున్నారు. తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే ప్రచారం రెండు రోజుల నుంచి మొదలైంది. ముందుగా సంక్రాంతికి వారం రోజులు సెలవు ఇవ్వాలి అని ప్రభుత్వం భావించింది. కోవిడ్ కేసులు విజృంభణతో ప్రభుత్వం సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచి ఇచ్చింది. ఈ నెల 16 వరకు సెలవులు ఉండగా 17న స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు యథావిధిగా తెరవాల్సి ఉంది.
కానీ కరోనా కేసులు తగ్గకపోవడంతో మరికొద్ది రోజులు సెలవులను పొడిగించాలని విద్యాశాఖ నుంచే కాక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. సెలవుల్లో నిమిత్తం చదువుకునే ప్రాంతాల నుంచి విద్యార్థులు తమ తమ సొంత ఊర్లకు వెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ చదువుకునే ప్రాంతానికి వచ్చి దాని ద్వారా కరోనా ఏమైనా సంక్రమణం జరిగితే భారీఎత్తున కరోనా కేసులు నమోదు అవుతాయి అనే ఉద్దేశంతో హాలీడేస్ పొడిగిస్తేనే మేలని వైద్య ఆరోగ్య శాఖ కూడా సర్కార్కు సూచించింది. దీంతో తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల అంటే జనవరి 30 వరకు సెలవుల్ని పొడిగించినట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ప్రకటించారు. కరోనా నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. 30 తరువాత పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే కొన్ని చోట్ల ఆన్లైన్ తరగతులు ప్రారంభించే అవకాశాలను కూడా ప్రైవేటు విద్యా సంస్థలు ఆలోచిస్తున్నాయి.. ఇప్పటికే రాష్ట్రంలో ఇంజినీరింగ్ తరగతులను ఈ నెల 17 నుంచి 22 వరకు ఆన్ లైన్లోనే నిర్వహించాలని జేఎన్టీయూ నిర్ణయించి సర్క్యూలర్ కూడా విడుదల చేసింది. ఎక్కువ రోజులు హాలీడేస్ ఇస్తే ఈ విద్యాసంవత్సరం పై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే రెండేళ్లు విద్యార్థులు నష్టపోయారని భావిస్తుండడంతో ఆన్ లైన్ తరగతులు నిర్వహించుకునే అవకాశం ఇవ్వచ్చని అంటున్నారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని కట్టడి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించే అవకాశం కనిపిస్తోంది.