రాజకీయాల్లో ఎంతటి వారైనా సరే ప్రజా వ్యతిరేకతకు తలొగ్గకక తప్పదు. చరిత్ర చెబుతున్న సత్యం ఇదే. ఉక్కు మహిళగా, పేదల పెన్నిధిగా పేరొందిన ఇందిరా గాంధీ, ఆంధ్రుల అభిమాన నటుడుగా బాసిల్లన ఎన్టీ రామారావులకు రాజకీయంగా ఎదురైన ఓటమిలే ఇందుకు నిరదర్శనం. ప్రజా అభిప్రాయానికి భిన్నంగా.. ప్రజాస్వామ్య అసలు లక్ష్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తే రాణించడం కష్టం. ఈ విషయాన్ని ఆలస్యంగానైనా గుర్తించినట్లుగా ఉన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.
తెలంగాణ తెచ్చిన నేతగా.. ప్రజలు ఆయన్ను ఆదరించారు. ముఖ్యమంత్రిని చేశారు. రెండోసారి సీఎంగా ఎన్నుకున్నారు. వరుసగా రెండుసార్లు సీఎంగా ఎన్నికవడంతో ఇక తెలంగాణలో తనకు తిరుగులేదనుకున్నారేమో గానీ.. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించడం ప్రారంభించారు. తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించిన గళాలకు, కలాలకు సంకేళ్లు వేయడం ఆరంభించారు. సాహిత్యకారులకు, కళాకారులపై ఉక్కుపాదం మోపారు. మావోయిస్టులు దేశ భక్తులు అంటూ ఉద్యమ సమయంలో కీర్తించిన కేసీఆర్.. ఆ తర్వాత వారిపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టారు. వారిపైనే కాదు.. వారికి మద్ధతు తెలుపుతున్నారని, వారితో సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ.. తెలంగాణలోని 16 ప్రజా సంఘాలను నిషేధిస్తూ ఈ ఏడాది మార్చి 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయంపై తెలంగాణ సమాజం, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేసీఆర్ తీరును పౌర సంఘం ఖండించింది. నిషేధాన్ని ఎత్తివేయాలంటూ లేఖలు వెల్లువెత్తాయి. అయినా కేసీఆర్‌లో మార్పు రాకపోవడంతో ప్రజా సంఘాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఆ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఏమనుకున్నారో ఏమో గానీ.. ఇంతలోనే కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. హైకోర్టులో విచారణ పూర్తికాక ముందే.. 16 ప్రజా సంఘాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసేందుకు యత్నించిన ప్రతిపక్ష పార్టీలను కలిసేందుకు ఆసక్తి చూపని కేసీఆర్.. ఏడేళ్ల తర్వాత తొలిసారి ఇటీవల అపాయింట్మెంట్ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న మరియమ్మ లాకప్‌డెత్ ఘటనపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు తనను కలిసేందుకు యత్నించగా.. వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. వారి డిమాండ్లను నెరవేర్చుతూ మరియమ్మ కుటుంబానికి సహాయం చేశారు. రాజకీయంగా తెలంగాణలో వస్తున్న మార్పులు, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత నేపథ్యంలోనే.. కేసీఆర్ తన తీరును మార్చుకుంటున్నారని ఈ పరిణామాలు చాటుతున్నాయి.
Also Read : పంపకాలు మొదలెట్టిన ఈటల రాజేందర్..!