లాక్ డౌన్ సడలింపులు ఇచ్చేశాక సీరియల్స్, చిన్న సినిమాల షూటింగులు మొదలయ్యాయి కానీ అసలైన స్టార్ హీరోలు మాత్రం ఇంకా సెట్లలోకి అడుగుపెట్టని సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో వైరస్ ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో ముందుకొచ్చే సాహసం చేయడం లేదు. అయితే ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తే మిగిలినవాళ్లకూ ధైర్యం వస్తుంది. ఇప్పుడా అడుగు మెగాస్టార్ వేయబోతున్నట్టు తెలిసింది. ఆచార్య షూటింగ్ ని వచ్చే నెల నుంచి తిరిగి ప్రారంభించేలా దర్శకుడు కొరటాల శివ చిరుని ఒప్పించినట్టుగా సమాచారం. ముందుగా ఎక్కువ క్రూ, జూనియర్ ఆర్టిస్టులు అవసరం లేని సన్నివేశాలు తీసి ఆపై పాటలు కూడా చిత్రీకరించే ఆలోచనలో ఉన్నారట.
బాలన్స్ ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ని అంతా సద్దుమణిగాక తీసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ సంక్రాంతి రిలీజ్ ని టార్గెట్ గా పెట్టుకున్నారట. కాని చేతిలో ఉన్న అయిదు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అన్ని పనులు పూర్తి చేయడం అంత సులభం కాదు. అందుకే అభిమానులు కూడా పోస్ట్ పోన్ కి ముందే ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు ఆచార్య కనక సెట్స్ పైకి వెళ్ళిపోతే ఒక్కొక్కరుగా కాలు బయట పెట్టేస్తారు. వీటిలో ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప నితిన్ రంగ్ దే, రానా విరాట పర్వం, బాలయ్య-బోయపాటి సినిమా, వెంకటేష్ నారప్ప, చైతు లవ్ స్టొరీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తదితరాలు ఉన్నాయి. ఇవన్నీ బరిలో దిగితే స్టూడియోలు కళకళలాడతాయి.
ఇలాంటి క్షణాల కోసమే నాలుగు నెలలుగా సినీ కార్మికులు కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఆచార్యకు సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన టెంపుల్ సెట్లో కొన్ని కీలక సన్నివేశాలు ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. రామ్ చరణ్ ఎప్పటి నుంచి ఎంటరవుతాడో ఇంకా క్లారిటీ లేదు. అది డిసైడ్ అయితే రిలీజ్ విషయంలో క్లారిటీ రాదు. మొత్తానికి ఆచార్య కనక నిజంగా అడుగు వేస్తే టాలీవుడ్ లో పరిణామాలు కొంత వేగంగా సాగుతాయి. కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తున్న ఆచార్యలో రెజినా స్పెషల్ సాంగ్ చేయగా తమన్నాతో పాటు చరణ్ కోసం ఓ హీరొయిన్ ని సెట్ చేయబోతున్నారన్న టాక్ ముందే ఉంది. మణిశర్మ పాటలకు చిరు స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి ఇప్పటికే ఉంది. హైదరాబాద్ లో షూటింగులు కనీసం ఆగస్ట్ నుంచైనా వేగమందుకుంటే థియేటర్లు తెరుచుకున్నాక పరిస్థితి యధాస్థితికి వచ్చేస్తుంది. దీనికి కనీసం ఇంకో నెల రోజులైనా వేచి చూడక తప్పదు మరి