ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో కొంతకాలంగా జరుగుతున్న విగ్రహాల ధ్వంసం వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ప్రతిపక్ష టీడీపీ వాదిస్తుండగా విగ్రహాల ధ్వంసం వెనుక కుట్ర కోణం ఉందని ప్రభుత్వం వ్యాఖ్యానిస్తుంది. దీంతో రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను రాష్ట్ర గవర్నర్ ను కలిసి వివరించడానికి టీడీపీ నేతల బృందం ప్రయత్నం చేస్తుంది.
ఈ నేపథ్యంలో నలుగురు టీడీపీ నేతలకు రాజ్ భవన్ నుండి గవర్నర్ ను కలవడానికి అపాయింట్మెంట్ లభించింది. టీడీపీ నేతలు ధూళిపాల నరేంద్ర, బుద్దా వెంకన్న,తెనాలి శ్రవణ్ కుమార్, వర్ల రామయ్యకు రాజ్ భవన్ నుండి అపాయింట్మెంట్ లభించడంతో రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం గురించి గవర్నర్ విశ్వభూషన్ హరిచంద్ కు వినతిపత్రం ఇవ్వనున్నారు. ఈ దాడుల వెనుక ప్రభుత్వ హస్తం ఉందని గవర్నర్ కు వివరించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే విగ్రహాల ధ్వంసం కేసులో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సీఐడీ విచారణకు బదులుగా కేంద్రం ఆధ్వర్యంలో నడిచే సీబీఐ విచారణకు ఆదేశించాలని గవర్నర్ ను కోరనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం మతం రంగు పులుముకున్న నేపథ్యంలో టీడీపీ నేతలు గవర్నర్ ను కలవనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.