సంధ్య కన్వెన్షన్ ఎండీ సర్నాల శ్రీధర్‌రావును రాయదుర్గం పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు. ఓ భవన నిర్మాణం విషయంలో పలువురిని శ్రీధర్ మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు చీటింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భవనం అమ్మకాల విషయంలో కొనుగోలుదారుల నుంచి శ్రీధర్ భారీగా నగదు వసూలు చేసి మోసం చేసినట్లు విచారణలో తేలడంతో శ్రీధర్ రావును రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసి ఇప్పుడు రాయదుర్గం, నార్సింగి, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లో బాధితులు క్యూ కడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సుమారు రూ.300 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు అంచనా.
నగరంలోని కొంతమంది బిల్డర్స్ వద్ద డబ్బులు తీసుకుని ఎగ్గొట్టినట్టు కూడా పోలీసులు తేల్చారు. రియల్ ఎస్టేట్ దందాలో మునిగి తేలిన శ్రీధర్ కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులకు ఆయన బినామీగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో కూడా శ్రీధర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయిందని అంటున్నారు. అయితే శ్రీధర్ రావును కేసు నుంచి తప్పించేందుకు ఓ అదనపు ఎస్పీ రంగంలోకి దిగినట్లు, శ్రీధర్ ను తప్పించేందుకు హైకోర్టులో సదరు ఎస్పీ తీవ్ర యత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాక టీడీపీ చీఫ్ చంద్రబాబుకు శ్రీధర్‌రావు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.
చంద్రబాబు సిఎంగా ఉన్న సమయంలో శ్రీధర్‌రావు పలు సెటిల్మెంట్లు చేసిన విషయాలు ఆయన అరెస్ట్ అయ్యాక వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ హయాంలో నాటి మంత్రులు, ఎమ్మెల్యేలకు బినామీగా వ్యవహరించి వారి నల్లధనాన్ని రియల్ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇవి కాకా గ్యాంగ్‌స్టర్ నయీంతో సత్సంబంధాలు ఉన్న పోలీసు ఉన్నతాధికారులతో కూడా శ్రీధర్‌రావు పలు వ్యాపారాలు చేసినట్టు చెబుతున్నారు. అయితే మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు అనే విషయం వెలుగులోకి రాకున్నా దందా నడిచిందని తెలంగాణా పోలీసులు భావిస్తున్నారు. అప్పట్లో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిన ఓటుకు నోటు కేసులో శ్రీధర్‌రావు కూడా పాత్రధారేనని పోలీసుల విచారణలో తేలింది కానీ వారు ధ్రువీకరించాల్సి ఉంది. మొత్తం మీద సదరు శ్రీధర్ రావుకు టీడీపీతో లింకులు ఉన్నాయని తేల్చిన పోలీసులు, ఆ లింకులు తేల్చే పనిలో పడ్డారు. ఒకవేళ ఆ లింకులు బయటకు వస్తే వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడక తప్పదు.
Also Read : Amaravati Movement – అమరావతి ఉద్యమం ఎందుకు విఫలమైంది..?