అజాత శతృవు, మృదు స్వభావి, సౌమ్యుడు, రాజకీయాల్లో మిస్టర్ క్లీన్, బీసీ నేతలను అణచివేస్తున్నారు.. ఇలాంటి పదాలతో ఈ రోజు మధ్యాహ్నం వరకూ మంత్రి నాని ముఖ్య అనుచరుడు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కర రావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను టీడీపీ నేతలు, మాజీ మంత్రులు వెనకేసుకుని వచ్చారు. చంద్రబాబు నుంచి మొదలుకొని నారా లోకేష్ సహా టీడీపీ మాజీ మంత్రులందరూ ఇదే పాట పాడారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కొల్లు రవీంద్రను వెనుకేసుకురావడంలో పల్లవిని మార్చారు.
చంద్రబాబు హయాంలో డిప్యూటీ సీఎంగా హోం శాఖ బాధ్యతలు నిర్వర్తించిన నిమ్మకాయల చిన రాజప్పు, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొల్లు రవీంద్రను వెనుకేసుకు రావడంలో చిన రాజప్పు తనదైన శైలిలో డైలాగులు పేల్చారు. పోలీసులు కేసు పెట్టాలంటే ఎలాగైనా పెడాతాని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగితే పెద్ద విషయం ఏమీలేదు. కానీ సదరు మాజీ హోం మంత్రి మరో అడుగు ముందుకేసి అనుభవంతో చెప్పినట్లు ఒక మాట చెప్పారు. కావాలనే నిందితుల చేత పోలీసులు కొల్లు రవీంద్ర పేరును చెప్పించారని చెప్పుకొచ్చారు. ఇక చిన రాజప్పు బాటలోనే టీడీపీ ఏపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకటరావు కూడా పయనించారు. కావాలనే కొల్లు రవీంద్రను ఈ హత్య కేసులో ఇరికించారన్నారు.
టీడీపీ నేతలు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారని ఊహించారో లేదా తమ పనిలో భాగంగా చేశారో గానీ పోలీసులు మాత్రం పక్కా ఆధారాలతో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరపరిచారు. 29వ తేదీ మోకా భాస్కర రావు హత్య జరిగిన వెంటనే నిందితులైన చింతా చిన్నతో సహా మరో నలుగురును అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా మాత్రమే తాము కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడలేదని ఈ రోజు ప్రెస్మీట్లో కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హత్యకు కొల్లు రవీంద్ర ఇంట్లో ఎలా పథక రచన జరిగింది. ఆ సమయంలో ఎవరు ఉన్నది, హత్యకు ముందు తర్వాత ప్రధాన నిందితుడు చింతా చిన్ని, కొల్లు రవీంద్ర మధ్య జరిగిన ఫోన్ సంభాషన కాల్ రికార్డులు, సర్క్యూమటెన్సెస్ ఎవిడెన్స్ అంతా సేకరించిన తర్వాతే కొల్లు రవీంద్రకు వారెంట్ జారీ చేశామని ఎస్పీ స్పష్టంగా చెప్పారు. అయితే ఈ విషయాలేవీ తమ ప్రకటనల్లో టీడీపీ నేతలు ప్రస్తావించడంలేదు. తమ సహచరుడుకు మద్ధతుగా మాట్లాడాలనే లక్ష్యంతోనే టీడీపీ మాజీ మంత్రులు స్టేట్మెంట్లు ఇస్తున్నారని చినరాజప్పు, కళా వెంకటరావు ప్రకటనలను చూస్తే ఇట్టే అర్థం అవుతోంది.